కేటీఆర్ పాదయాత్ర పోస్ట్ పోన్.. కారణమేంటంటే?
Publish Date:Jul 10, 2026
Advertisement
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్ తన పాదయాత్ర ప్రకటించారు. ఆయన ప్రకటించిన మేరకు ఈ ఏడాదే ఆయన పాదయాత్ర ప్రారంభించాలి. కానీ నుంచే ఈ మహా యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. తన పాదయాత్ర ద్వారా పార్టీకి ఏ మేరకు మైలేజ్ వస్తుంది.. పార్టీ అధికారంలోకి రావడానికి తన పాదయాత్ర ఏంతగా దోహదపడుతుంది వంటి వివరాలను ఆయన క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిచి ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక పాదయాత్రపై కుటుంబ సభ్యులతో కూడా చర్చించారు. ఇన్నీ చేసి ఇక పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేయడమే తరువాయి అని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ ఏడాదే పాదయాత్ర ప్రారంభిస్తానని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేని ఈ సమయంలో పాదయాత్ర చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదన్న భావనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నారంటున్నారు. కాగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టదలచిన బస్సు యాత్రను కూడా ఇదే కారణంతో నిరవధికంగా వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సాధారణంగా పాదయాత్రలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు చేపడితేనే ఫలితం ఉంటుంది. అలా కాకుండా పాదయాత్ర చేపడితే.. ప్రజల నుంచి పెద్దగా స్పందన ఉండదని పరిశీలకు చెబుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు కనుక మరో ఏడాది పాటు పాదయాత్ర ఊసెత్తకుండా ఉండటమే మేలని కేటీఆర్, బస్సు యాత్ర కూడా ఏడాది తరువాత చేపడితేనే ఫలితం ఉంటుందని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. KTRs padayatra postponed, Brs, Working President, Revantah Government, Anti Incumbency
http://www.teluguone.com/news/content/ktrs-padayatra-postponed-39-225602.html





