ఏసీబీ విచారణకు ఓకే.. ఈడీ విచారణకు డుమ్మా.. కేటీఆర్ చేసేది ఇదేనా?
Publish Date:Jan 5, 2025
Advertisement
ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఏసీబీ విచారణకు హాజరు కావాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కేసులో తాను దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ అయి ఉన్న నేపథ్యంలో ఏసీబీ విచారణకు హాజరైనా అరెస్టయ్యే ప్రమాదం లేదని ఆయన భావిస్తున్నారు. అన్నిటికీ మించి హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ పై తీర్పు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్న కేటీఆర్, ఏసీబీ విచారణకు గైర్హాజరైనా, డుమ్మా కొట్టినా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే విషయంలో అన్ని కోణాలలోనూ ఆలోచించి, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తారువాతే కేటీఆర్ ఈ విచారణకు హాజరు కావాలన్న నిర్ణయానికి వచ్చారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అన్నిటి కంటే కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం.. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉన్న కారణంగా ఏసీబీ తనను ఇప్పటికిప్పుడు అరెరస్టు చేసే అవకాశం లేదు. ఎటువంటి తొందరపాటు చర్యా తీసుకోవద్దంటూ కోర్టు ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు వెలువడే వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దంటూ ఆదేశించడంతో ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఎంత మాత్రం లేవు. అయితే విచారణ సందర్భంగా కేటీఆర్ కు ఏసీబీ పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అలాగే విచారణ కూడా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. ఇక ఈ కేసు విషయంలో కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవనీ, సోమవారం (జనవరి 6) ఏసీబీ, మంగళవారం (జనవరి 7) ఈడీ కేసీఆర్ ను విచారించనున్నాయి. ఇక్కకే కేసీఆర్ కు ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏసీబీ విచారణకు హాజరై, ఈడీ విచారణకు గైర్హాజరైతే ఆయనపై విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే ఆ విమర్శలకు వెరచి ఈడీ విచారణకు హాజరైతే అరెస్టయ్యే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఈడీ అరెస్టు చేయకుండా కేటీఆర్ కు కోర్టుల నుంచి ఎటువంటి రక్షణా లేదు. దీంతో ఈడీ ఆయనను విచారించిన తరువాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు హాజరై, మంగళవారం (జనవరి 7)న ఏవో కారణాలు చెప్పి ఆయన ఈడీ విచారణకు గైర్హాజర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కాకుండా ఈ కేసులో ఏ3గా ఉన్న ఐఏఎస్ అర్వింద్ గ్రేటర్ మాజీ చీఫ్ ఇంజినీర్ లు డుమ్మా కొట్టారు. కేటీఆర్ కూడా అదే చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ktr-to-attend-acb-inquiry-on-january-6th-25-190844.html





