కేటీఆర్.. దిగ్విజయ్ సింగ్.. ట్విట్టర్ వార్
Publish Date:May 1, 2017
Advertisement
గతంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ పై ట్విట్టర్ ద్వారా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ స్పెల్లింగ్ కూడా సరిగా రాయడం రాదు అంటూ కామెంట్లు విసిరారు కేటీఆర్. ఇంకా పలు సందర్బాల్లో ఇద్దరి మధ్య పరస్పర విమర్శలు తలెత్తిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు మరోసారి ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులపై.. ‘తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్‌సైట్ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారు. యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్ అధికారం ఇచ్చారా?. అలా అయితే ఆయన దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇక దీనిపై స్పందించిన కేటీఆర్ దిగ్విజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం తగదు. దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. లేదంటే చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న పోలీసుల నైతికతను ప్రశ్నించే అర్హత దిగ్విజయ్‌కు లేదు.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. మరి దీనిపై డిగ్గీ రాజా ఎలా స్పందిస్తారో చూడాలి.
http://www.teluguone.com/news/content/ktr-39-74404.html





