కేశినేని నానికి కమలం కండువా అంత వీజీ కాదు!
Publish Date:Feb 17, 2025
Advertisement
కేశినేని నాని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న తరువాత ఇప్పుడు మళ్లీ ఆయన మనసు పాలిటిక్స్ వైపు మళ్లినట్లు కనిపిస్తున్నది. వరుసగా రెండు సార్లు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని, ఆ తరువాత అహం తలకెక్కి సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. కేశినేని ట్రావెల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నాని రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయవాడ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తెలుగుదేశంలో ఆయనకు సముచిత ప్రాధాన్యం కూడా లభించింది. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడారనడం కంటే తెలుగుదేశం పార్టీయే ఆయనను వద్దనుకుందని అనడం కరెక్ట్. కేశినేని నాని వ్యవహార శైలి, వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరగడం ద్వారా తన ఉద్దేశాలను చాటిన నానిని ఇక పార్టీకి నీ సేవలు చాలు అని చంద్రబాబు మర్యాదగా చెప్పారు. ఆ విషయాన్ని స్వయంగా నానియే అప్పట్లో చెప్పారు కూడా. సరే ఏది ఏమైతేనేం.. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నానికి ఆయన సొంత సోదరుడు, తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ పరాజయ పరాభవాన్ని జీర్ణించుకోలేకపోయిన నాని రాజకీయ సన్యాసం ప్రకటించారు. ప్రకటించినట్లుగానే రాజకీయాలకు దూరంగా ఇంత కాలం ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చూపు మళ్లీ రాజకీయాల వైపు మళ్లంది. ఎంపీగా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఇప్పుడు ఆయన కమలం పార్టీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తరచూ బీజేపీ నేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. తాజాగా ఇటీవల కేశినేని నాని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయినట్లు వెల్లడి కావడంతో ఆయన కమలం గూటికి చేరబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కేశినేని నాని వాటిని ఖండించారు. అయితే తన వర్గీయులతో నిర్వహించిన భేటీలో తాను రాజకీయాలకు మాత్రమే దూరం అయ్యాననీ, ప్రజాసేవకు కాదని చెప్పడం ద్వారా.. తన రాజకీయ జీవితం ముగిసినట్లు కాదని సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన బీజేపీ గూటికి చేరడానికి చేస్తున్న ప్రయత్నాలే ఆయన అడుగులు ముందుకు సాగుతాయా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమౌతున్నాయి. తెలుగుదేశంతో రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. అటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ మనుగడ దాదాపుగా తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ కేశినేని నానికి తలుపులు తెరుస్తుందా? తెరిచినా ఆయనకు సముచిత స్థానం ఇవ్వగలుగుతుందా? అన్నిటికీ మించి తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని ఉండగా, విజయవాడ నియోజకవర్గంలో కేశినేని నాని రాజకీయాలు చేయడానికి అనుమతిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసినట్లే.. ఆయన ఎంత గట్టిగా తట్టినా ఆ పార్టీ తలుపులు తెరుచుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో కమలం ఆయనకు కండువా కప్పి అక్కున చేర్చుకునే అవకాశాలు లేవనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kesineni-nani-eyes-join-bjp-39-192992.html





