వేడికి బెల్లం కరిగి జిగటగా మారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో బెల్లం తాజాగా, పొడిగా ఉంటుంది!
Publish Date:Apr 29, 2026
Advertisement
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు. అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం. గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్ నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని, తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి, బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/keep-jaggery-fresh-and-dry-with-these-simple-tips-35-218548.html




