జగదీశ్ పార్టీలో ఏం జరిగింది? లీకిచ్చిందెవరు? బలయ్యేదెవరు?
Publish Date:Jun 8, 2021
Advertisement
ఈటల రాజేందర్ బర్తరఫ్ రచ్చ చల్లారకముందే టీఆర్ఎస్ లో మరో తుపాను బయటికొచ్చింది. కర్ణాటకలో జరిగిన ఓ విందు పార్టీ.. గులాబీ పార్టీలో కల్లోలం రేపుతోంది. ఈటలకు బర్తరఫ్ కు కారణమైన ఈ ఘటనపై.. ఇప్పుడు మరో మంత్రి మెడకు చుట్టుకుంటోంది. కేసీఆర్ కు అత్యంత నమ్మినబంటుగా ముద్ర పడిన మంత్రి జగదీష్ రెడ్డికి కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో సెగలు రేపుతున్న కర్నాటకలోని హంపీలో జరిగిన పార్టీలో అసలేం జరిగింది..మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ పార్టీలో జరిగింది ఇది.. మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా గత జనవరిలో కర్నాటక రాష్ట్రంలోని హంపిలోని ఒక ఫాంహౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు. తనకు బాగా సన్నిహితులు అనుకున్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో పాటు, అధికారంలో వివిధ హోదాలను అనుభవిస్తున్న పలువురు ముఖ్యులు ఈ పార్టీకి హాజరయ్యారు. హుషారుగా పార్టీ మొదలైంది. మందేసిన తర్వాత అసలు సినిమా మొదలైంది. కేసీఆర్ పాలన పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు మనసులో మాట బయట పెట్టారట. పాలన పూర్తిగా కుటుంబమయమైపోయిందని... పెత్తనం మొత్తం అయ్యా కొడుకుల దగ్గరే ఉందని ఒక్కొక్కరుగా రెచ్చిపోయారట. ఈటెల రాజేంద్రను అధిష్టానం టార్గెట్ చేయడంపైనా కొందరు ఫైరయ్యారట. పెద్దసార్ నియంత అయినా భరించనం కాని.. రేపొద్దుగాల చిన్నసారు సీఎం అయితే... భరించుడు మనతో ఐతదా...!? అన్న కోణంలో చర్చ జరిగిందట. సహజంగా కళాకారుడైన ఓ ఎమ్మెల్యే మత్తులోనే కేసీఆర్ నియంత పాలన, రేపొద్దున కేటీఆర్ సీఎం అయితే చిన్నసారు నియంత పాలన ఎట్లుంటదో తనదైన శైలిలో ఊహించుకుని, పాటకట్టి పాడాడట. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ మనసులో మాట చెప్పుకోగలం అన్నట్టు ఎవరికి వారు రెచ్చిపోయారని సమాచారం. సీన్ కట్ చేస్తే... హంపిలో జరిగిన తతంగమంతా కేసీయార్‌కు చేరింది. ఆ పార్టీలో పాల్గొన్న ఒక ఎమ్మెల్యేల ద్వారా ఆ వీడియో కూడా బాస్ కు అందిదట. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే వీడియో ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ముఖ్యుల ప్రతి కదలికపై నిఘా ఉంది. ప్రతి కాల్ రికార్డవుతుంది… తనకు పూసగుచ్చినట్టు అన్ని వివరాలూ చేరిపోయాయి… ఆ పాటను జగదీష్‌రెడ్డి ఆపలేదు సరికదా సైలెంటుగా చూస్తూ కూర్చున్నాడట… కేసీయార్ దయవల్ల ఓ నామినేటెడ్ పోస్టు పొందిన ఓ మేధావి కేసీయార్ మీద ఔట్ రైట్ విమర్శలకు దిగాడట… నిజానికి బెంగుళూరులో ఇలాంటి మీటింగే ఒకటి పెట్టాడట ఈటల… ఆ వివరాలన్నీ బయటికి వచ్చాకే ఈటలతో రిలేషన్స్ పూర్తిగా దెబ్బతిన్నయని తెలుస్తోంది. చివరకు కేసీయార్ కత్తితీశాడు. ఇప్పుడిక జగదీష్‌రెడ్డే టార్గెట్. తనను మంతివర్గం నుంచి తీసేయడమే కాదు, ఆయన స్థానంలో సీఎం తన సన్నిహితుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని తీసుకోబోతున్నాడని చెబుతున్నారు. జగదీష్‌రెడ్డి సీఎంను కలిసి ఏదో వివరణ ఇచ్చుకున్నా సీఎం కన్విన్స్ కాలేదని తెలుస్తోంది. జగదీష్‌రెడ్డి కుటుంబసభ్యుడు, ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులో ఉన్న వ్యక్తి ఈమధ్య ఫేస్‌బుక్‌లో కేసీయార్ వ్యతిరేక పోస్టులు పెట్టారు. అప్పుడే జగదీష్‌రెడ్డికీ కేసీయార్‌కూ గ్యాప్ వచ్చిందన్న సంకేతాలు వచ్చాయి. అయితే వేటు పడితే జగదీశ్ రెడ్డి ఒక్కడిపైనే పడుతుందా లేద పార్టీలో పాల్గొన్న ఎమ్మెల్యేలపైనా చర్యలుంటాయా అన్నది తేలడం లేదు. మొత్తానికి హంపి పార్టీ గులాబీ పార్టీలో పెను ప్రకంపనలు, కీలక పరిణామాలకు వేదిక కాబోతుందని భావిస్తున్నారు. చూడాలి మరీ ఏం జరగబోతుందో..
http://www.teluguone.com/news/content/kcr-will-suspend-jagadish-reddy-from-cabinet-soon-25-117216.html





