ఎన్నాళ్లకెన్నాళ్లకు.. భారీ బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్
Publish Date:Apr 14, 2026
Advertisement
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టకేలకు ఈ నెలలో ఒక భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఔను 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత కేసీఆర్ పాల్గొననున్న అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ ఇదే కానుంది. ఇంతకీ ఆ సభ ఏమిటి? ఎక్కడ? ఎప్పుడు? అన్న విషయానికి వస్తే.. ఈ నెల 20న బీఆర్ఎస్ జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ సభకు కేసీఆర్ రానున్నారు. ఇంతకీ ఆ సభ ఎందుకంటే.. మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కసరత్తు ప్రారంభించారు. జగిత్యాల సమీపంలో దాదాపు పది ఎరాల విస్తీర్ణంలో ఈ సభను ఏర్పాటు చేయనున్నారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, చోప్పదండి నియోజకవర్గాల నుండి లక్ష మందికి పైగా ఈ సభకు హాజరౌతారని అంచనా వేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బహిరంగ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి దోహదపడుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనుండటంతో, ఆయన ఇచ్చే రాజకీయ సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను కేసీఆర్ ఈ సభ వేదిక నుంచే ప్రకటించే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/kcr-to-participate-in-publicmeeting-25-217331.html





