జనవరిలో టీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కు? ఇక జాతీయ రాజకీయాలకే కేసీఆర్ పరిమితం
Publish Date:Nov 8, 2022
Advertisement
దీర్ఘ కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కేటీఆర్ ఆకాంక్ష నెరవేరే సమయం వచ్చేసిందా అంటే ఔననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. పాన్ ఇండియా పార్టీగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక పూర్తి సమయం కేటాయించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు లేదని చాటిన ఆయన ఇక తన జాతీయ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించనున్నారనీ, అందు కోసం రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పగ్గాలను తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించేందుకు నిర్ణయం తీసేసుకున్నారనీ అంటున్నారు. తొలుత వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి.. ఆ ఎన్నికలలో మూడు నుంచి నాలుగు సీట్లు గెలుచుకోవడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీకి గట్టి సవాల్ గా నిలిచేందుకు ప్రణాలిక రూపొందించిన కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పగ్గాలను కేటీఆర్ కు అప్పగించనున్నారు. గుజరాత్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న కవితను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జోరుగా జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఎక్కడా కవిత ప్రమేయం లేకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక వేళ గుజరాత్ ఎన్నికలకు ముందే..ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచి కవితకు సమన్లు జారీ చేయడం, విచారణకు పిలవడం, అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడితే.. గుజరాత్ ఎన్నికలలో పార్టీకి సానుభూతి పవనాలు వీచేలా అదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అంశాన్ని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ప్రధాన ఎన్నికల అంశంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ అంశం ఇప్పటికే గుజరాత్ లో బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. దీనికి తోడు మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా బీజేపీని ఆత్మరక్షణలో పడేసిందంటున్నారు. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు నెమ్మదిస్తుందని అంటున్నారు. కేసీఆర్ కూడా అదే అంచనాతో ఉన్నారంటున్నారు. ఆ కారణంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కవితపై ఆరోపణలను తురఫు ముక్కగా వాడే అవకాశాలను రిజర్వ్ లో ఉంచారని అంటున్నారు. ఇక తాను అనుకున్నట్లుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మూడు నుంచి నాలుగు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. రాష్ట్ర పగ్గాలను తనయుడు కేసీఆర్ కు అప్పగించేసి కుమార్తె కవితతో కలిసి పూర్తిగా జాతీయ రాజకీయాలపై కాన్సన్ ట్రేట్ చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. గుజరాత్ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటితే తాను ఇంత కాలం చెబుతూ వచ్చిన మూడో ఫ్రంట్ సాకారం అవ్వడానికీ, ఆ ఫ్రంట్ కు తానే నాయకత్వం వహించడానికి మార్గం సుగమమౌతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారు కేసీఆర్ వెంట ర్యాలీ అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/kcr-to-confine-to-national-politics-party-and-government--reins-to-ktr-25-146794.html





