కేసీఆర్ స్లీపింగ్.. ఎమ్మెల్యేల జంపింగ్.. అసెంబ్లీలో బీఆర్ఎస్ పరిస్థితేంటి?
Publish Date:Jul 20, 2024
Advertisement
భారత రాష్ట్ర సమితి... పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆ పార్టీకి గళమెత్తడానికి అజెండాయే లేకుండా పోయింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు ఓ వెలుగువెలిగిన చంద్రశేఖరరావు ఇప్పుడు అమావాస్యచంద్రుడిలా మారిపోయారు. మసకబారిపోయారు. అపర చాణక్యుడిగా, మాటల మాంత్రికుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు చేష్టలుడిగి నిలబడిపోయారు. రాజకీయ వ్యూహాలలో ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందుంటారని పేరొందిన కేసీఆర్ ఇప్పుడు వ్యూహాలంటే ఏమిటో తిలియని పరిస్థితిలో పడ్డారు. ఆయన ఏం చేసినా రివర్స్ అవుతోంది. ఒక్క ఓటమి ఆయనను, ఆయన పార్టీనీ ఉనికి కోసం వెంపర్లాడే పరిస్థితికి తెచ్చింది. గతంలో కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన వారే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తూ దూరం జరుగుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ సైలెంటైపోయారు. మధ్యలో ఒకటి రెండు సార్లు జనం మధ్యకు వచ్చినా ఆయన వాగ్దాటిలో కానీ, ప్రసంగాలలో కానీ మునుపటి పదును కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన కుమార్తె కవిత అరెస్టు తరువాత ఆయన రాజకీయ వ్యూహాలన్నీ పక్కదారి పట్టాయన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. కుమార్తెను కాపాడుకోవడం కోసం ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారనీ, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన వ్యూహాలు రచించారనీ, అభ్యర్థుల ఎంపికలో కూడా బీజేపీకి ఏ మాత్రం నష్టం వాటిల్లకూడదన్న జాగ్రత్త వహించారనీ బీఆర్ఎస్ నేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడితే నష్టపోయేది బీఆర్ఎస్ అనే తెలిసి కూడా పార్టీ భవిష్యత్ గురించి ఇసుమంతైనా ఆలోచించకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పరోక్ష సాయం చేశారు. ఆ కారణంగానే బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయింది. ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 16 శాతానికి పడిపోతే.. ఆ మేరకు బీజేపీ బలపడి ఓట్ల శాతాన్ని 35శాతానికి పెరిగింది. ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ తో పొత్తు, విలీనం అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టి పార్టీ పటిష్టతకు కేసీఆర్ నుంచి ఎటువంటి అడుగులూ పడటం లేదు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ నిరుత్సాహంతో ఉంది. నిజానికి కేసీఆర్ బీజేపీతో కలిసే వ్యూహానికి పదును పెట్టిన లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. బీజేపీతో అయితే పొత్తులు పెట్టుకుని లేకపోతే విలీనం చేసి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అధికారికంగా బీఆర్ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. కానీ కేసీఆర్.. అరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ సీనియర్ నేత తనకు ఫోన్ చేశారని ఆయన గతంలో చెప్పారు. బీజేపీ తల్చుకుంటే ఆపరేషన్ కమల్ ప్రారంభిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ఆకర్షించడం పెద్ద పనేమీ కాదని ఎక్కువ మంది భావన. ఈ ఆలోచనలతోనే కేసీఆర్ బీజేపీతో కలిసిపోయేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఇక మరో వైపు రేవంత్ సర్కార్ ఫుల్ స్పీడ్ లో ఉంది. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడం, ఇంకో వైపు హామీల అమలుతో ప్రజాదరణను పెంచుకోవడంలో రేవంత్ సర్కార్ సక్సెస్ అయ్యింది. అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దోహదపడతాయని బీఆర్ఎస్ భావించిన అంశాల విషయంలో రేవంత్ సర్కార్ చాకచక్యంగా వ్యవహరించారు. రైతు రుణమాఫీని అమలు చేయడం, విద్యార్థుల డిమాండ్ మేరకు గ్రూప్ 2 ను వాయిదా వేయడం ద్వారా బీఆర్ఎస్ అస్త్రాలుగా భావించిన అంశాలను నిర్వీర్యం చేసేశారు. రుణమాఫీ అమలుతో రైతులు, గ్రూప్ 2 రద్దుతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు నిధులను రుణమాఫీకి మళ్లించారంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ కు ఏ అవకాశమూ మిగలలేదు.
http://www.teluguone.com/news/content/kcr-silence-and-mlas-jumping-25-181128.html





