బీఆర్ఎస్ లో చీలికకు బీజం కేసీఆర్ మౌనం!
Publish Date:Sep 30, 2024
Advertisement
మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. ఇవీ బీఆర్ఎష్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన అధికారంలో ఉన్న పదేళ్లూ వినిపించిన మాటలు. కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని అప్పట్లో ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి. కానీ ఒక్క ఓటమి.. ఔను ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ ను నిర్వీర్యుడిగా మార్చేసింది. ఆయన వ్యూహ రచన సంగతి పక్కన పెడితే.. అసలాయన రాజకీయంగా ఓనమాలు కూడా మరిచిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది. తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి పది నెలలు కావస్తున్నది. ఈ పది నెలల కాలంలోనూ కేసీఆర్ వినిపించింది, కనిపించిందీ చాలా తక్కువ. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సాహసం కూడా చేయలేదు. ఏదో మొక్కుబడికి అన్నట్లు ఒక్క రోజు మాత్రం అదీ రేవంత్ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు హాజరయ్యారు. ఇన్ని నెలలూ ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇక బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చక్కబెడుతున్నారు. హరీష్ రావు పార్టీని రాజకీయంగా యాక్టివ్ గా ఉంచడానికీ, లేదా యాక్టివ్ గా ఉందని ప్రజలను నమ్మించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా వివాదంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు. అయితే ఇప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రాకపోతే అంది వచ్చిన అవకాశం కూడా చేజారిపోయే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళనలో ఉంది. అయితే ఆయనను గట్టిగా అభిమానించేవారంతా మాత్రం ఆయన పెద్ద వ్యూహంలో ఉన్నారనీ, తెరవెనుక పార్టీ పటిష్టత కోసం గట్టిగా పని చేస్తున్నారనీ అంటున్నారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఆయన ఎప్పటికప్పుడు తెలుగసుకుంటున్నారని అంటున్నారు. అయితే పరిశీలకులు మాత్రం కేసీఆర్ రాజకీయంగా అస్త్రసన్యాసం చేసినట్లేని ఆయన మౌనాన్ని ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లో రెండు పెద్ద తలకాయల మధ్య విభేదాలు ఆ పార్టీని నిట్టనిలువుగా చీల్చే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, అలాగా పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా, మూసీ ఆక్రమణల కూల్చివేతలకు నిరసనగా ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా మలచుకునే విషయంలో కేటీఆర్, కేటీఆర్ లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హరీష్ రావు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమౌతూ ఉద్యమాలు నిర్మించడానికి సమాయత్తమౌతుంటే.. కేటీఆర్ సోషల్ మీడియాకు పరిమితమైపోవడం ఇదే సూచిస్తోందని అంటున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన నాటి నుంచీ హరీష్, కేటీఆర్ ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందని, ఇందుకు అసెంబ్లీలో విపక్ష నేత ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ ఆ పదవి చేపట్టారని అంటున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ బయటకు వచ్చి పార్టీలో పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ లో చీలిక అనివార్యమౌతుందని పార్టీ వర్గాలే అంటున్నాయి. కేసీఆర్ ప్రజాకర్షణ ఉన్న నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి నాయకుడు పార్టీ ఓటమి తరువాత ప్రజలకు కనిపించకుండా ముఖం చాటేయడమంటే.. తన పాలనలో తప్పులు జరిగాయనీ, ప్రజా హితంగా పాలన సాగించలేదనీ అంగీకరించడమే ఔతుందని.. సుదీర్ఘకాలంగా ఆయన ప్రజలతో మమేకం కాకుండా ఫామ్ హౌస్ కు పరిమితం కావడం క్యాడర్ కు సైతం తప్పుడు సంకేతాలు ఇస్తున్నదనీ పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడి ప్రజలలోకి రాకుంటే ఆయన మౌనమే బీఆర్ఎస్ చీలికకు బీజం వేస్తుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-sclience-sign-of-split-in-brs-25-185865.html





