కేసీఆర్ జాతీయ యాత్ర ఎందు కోసం? ఎవరి కోసం?
Publish Date:May 23, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావుకు తెలుగు భాష,సాహిత్యంపై మంచి పట్టుంది. అందులో సందేహం లేదు.అదే విధంగా ఆయన రాజకీయ చతురత విషయంలోనూ ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవలసిన అవసరం లేదు. అందుకే, ఆయన ఇప్పుడు అవునన్న విషయాన్ని మరో క్షణంలో కాదనీ అనగలరు. నిజమే, రాజకీయ నాయకులు మాట మీద నిలబడడం అంటే, అది అయ్యే పని కాదు. అందుకే గురజాడవారి గిరీశం, ‘ఒపినిఒన్స్ మార్చుకోలేని వారు రాజకీయ నాయకులు కాలేర’ని అన్నారు. అయితే అదే సమయంలో ఏ ఎండకా గొడుగు పట్టే రాజకీయ నాయకుల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోంది. ప్రజలు అలాంటి నాయకులను పక్కన పెడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి అదే, విశ్వసనీయత కోల్పోయినందునే తెరాస ఇరకాటంలో పడిందని, పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇది నడుస్తున్న చరిత్ర చెపుతున్న మరో సత్యం. అందుకు కూడా ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రే కేసేఆరే, ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు అంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి మొదలు దళితులకు మూడు ఎకరాల భూమి వరకు, కేజీ నుంచి పీజీ, వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ వరకు ఇంకా అనేక విషయాల్లో ఏ విధంగా మాట మార్చారో, వేరేగా చెప్పనవసరం లేదు. గూగుల్’ని అడిగితే చాలు, ముఖ్యమంత్రి మాట మార్చిన సందర్భాలకు సంబందించిన వీడియోలు పరుగులు తీస్తాయి. అదే విధంగా ధాన్యం సేకరణ విషయంలో, నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం పంజాబ్’కు ఒక విధానం, తెలంగాణకు ఒక విధానం అవలంబిస్తోందని పంజాబ్ రైతులకు వ్యతిరేకంగా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చేసిన ముఖ్యమంత్రి, ఇపుదు అదే పంజాబ్ గడ్డ మీద (చండీగఢ్)నుంచి దేశంలోని రైతు సంఘాలన్నీ సంఘటితం కావసిన సమయం ఆసన్నమైందని, మరో రైతు ఉద్యమానికి పిలుపునీయడం ముఖ్యమంత్రి ద్వంద నీతిని మరోమారు రుజువు చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజానికి, ఇప్పటికే చాలా వరకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు కేసీఆర్’ ను అంతగా విశ్వాసంలోకి తీసుకోరనే ప్రచారం జరుగుతోంది. అందుకే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు నడుస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్’ ముంబై వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే’ని కలిసి ఫ్రంట్ కట్టడం పై మంతనాలు జరిపారు. అలాగే, చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి ,డీఎంకే అదినేత స్టాలిన్’తోనూ కాంగ్రేస్సేతర, బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటు గురించి మంతనాలు సాగించారు. ఆ సమయంలో ఇంకేముంది, హైదరాబాద్ వేదికగా ఫ్రంట్ ఏర్పాటు అయిపోయినట్లే అనే గంభీర ప్రకటనలు చేశారు.అయితే, ముఖ్యంత్రి ఇలా రాగానే, ఎన్సీపీ, డీఎంకే, శివసేన సహా ఇతర పార్టీలు నాయకులు కాంగ్రెస్ లేని ఫ్రంట్’ వృధా ప్రయాస అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్’తోనే కలిసి సాగుతామని స్పష్టం చేశారు. అంతలోనే మళ్ళీ ఆయనే థర్డ్ ఫ్రంటూ లేదు ఫోర్త్ టెంటెంటు లేదని తేల్చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రాతీయ పార్టీల నేతలతో మంతనాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో కేసేఆర్ , ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్’తో , అంతకు ముందు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ, అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్’తో సమావేశ మయ్యారు. గతంలో పవార్, థాకరే, స్టాలినలానే కేజ్రీవాల్’, అఖిలేష్ యాదవ్’ కూడా అల్టిమేట్’గా కేసీఆర్’తో చేతులు కలపక పోవచ్చని అంటున్నారు. నిజానికి గతంలోనే కేజ్రీవాల్’ను అప్పాయింట్మెంట్ కోసం ముఖ్యంత్రి కేసీఆర్ నాలుగైదు రోజులు ఢిల్లీలో వెయిట్ చేసారు. అయినా, ఫలితం లేక పోయింది.అప్పట్లో,కేసేఆర్’ను కలవడం ఇష్టం లేకనే కేజ్రీవాల్ ఆయనకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్తలొచ్చాయి. అదే విధంగా, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీతో కలిసి వారణాసి ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొంటారని వార్తలు అయితే వచ్చాయి కానీ, కేసీఆర్ వారణాసి వెళ్ళలేదు. మమతా బెనర్జీ, అభ్యంతరం చెప్పడం వల్లనే అఖిలేష్ యాదవ్, కేసీఆర్’ ను రావద్దని కోరారని అప్పట్లో ప్రచారం జరిగింది. నిజానిజాలు ఎలా ఉన్నా, ఇప్పుడు కూడా పంజాబ్ రైతులకు పరిహారం ఇస్తామంటే వద్దనడం భావ్యం కాదని కేజ్రీవాల్, సరే అన్నారని, తెలంగాణా ఆప్ నాయకుల సమాచారం.అందుకే, ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ రాజకీయాలలో రాణించేందుకు చేస్తున్న తాజా ప్రయత్నాల విషయంలోనూ అనుమాలే వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ముఖ్యమంత్రి జాతీయ యాత్రకు సంబంధించి కేసీఆర్, తెరాస సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలనే ఉన్నయని పార్టీ అంతర్గత వర్గాలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతానికి వస్తే, ముఖ్యమంత్రి కేసేఆర్, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను ఒకప్పుడు సమర్ధించారు. ఇప్పుడు, ఆ చట్టాలు రద్దయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వమే ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత, ఆ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకగం ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం పాటు సాగిన ఆందోళనలో చనిపోయిన పంజాబ్ రైతులకు పరిహారం పంచి పెట్టారు. సరే, తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఎండగట్టి, పంజాబ్ రైతులకు తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని పందారం చేయడం ఏమిటని, ప్రతి పక్షాలు, ప్రజలు చేస్తున్న విమర్శలను పక్కన పెట్టినా. రైతు చట్టాల విషయంలో ముఖ్యమంత్రి ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి మాట మర్చారనే విమర్శలు వినవస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/kcr-national-for-whom-and-why-25-136297.html





