కేసీఆర్.. చంద్రబాబును చూసినేర్చుకో!
Publish Date:Jul 29, 2024
Advertisement
రాజకీయాల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావటం సర్వసాధారణం. అధికారంలో ఉన్నామని విర్ర వీగితే అధికారం కోల్పోయిన తరువాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అన్నీ అనుకూలిస్తే దేశానికి ప్రధాని కాబోయేది నేనే అంటూ పెద్ద పెద్ద స్టేట్ మెంట్లతో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. పక్కరాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా.. ఆయన దగ్గరకు నేను పోయేదేంటి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించారు. ఇక అసెంబ్లీలో అయితే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులను ఓ ఆటాడుకున్నారు. ఇంతలా రెచ్చిపోయిన నేతలను ప్రజలు అస్సలు ఉపేక్షించరు. తెలంగాణ ప్రజలు కూడా అదే పనిచేశారు. ఎన్నికల సమయలో కేసీఆర్ కు గట్టి షాకిచ్చారు. దీంతో అధికారం కోల్పోయి.. ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చేందుకు సైతం కేసీఆర్ భయపడుతున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన నాటినుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్టీ నేతలకు అప్పుడప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నారే తప్ప అధికార పార్టీని నేరుగా ఎదుర్కొనే సాహసం చేయడం లేదు. కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వచ్చినా.. కాంగ్రెస్ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నా ఆయన పెద్దగా నోరు మెదపడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతుండటం బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. గత అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని ఒత్తిడి చేశారు. అయినా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్నివిని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. వేస్ట్ బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం రాదు.. వాళ్లకు ఏఏ రంగానికి ఎంత కేటాయింపులు చేయాలోకూడా తెలియడం లేదంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్నెళ్లు సమయం ఇవ్వాలని నేనే అసెంబ్లీకి రాలేదు.. ఇక నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంగతి చూస్తా అంటూ కేసీఆర్ చిన్నపాటి హెచ్చరికలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ ప్రసంగాన్ని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. సింహం అసెంబ్లీకి వస్తుంది.. కాంగ్రెస్ నేతలకు మూడింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టాయి. కానీ, బడ్జెట్ పై అసెంబ్లీలో జరిగే చర్చకు సైతం కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీంతో అసెంబ్లీకి సింహం వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీకి పోకుండా ఇంటివద్ద ఏం చస్తున్నావ్ కేసీఆర్ అంటూ అదే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఇక కేసీఆర్ పనైపోయింది.. బీఆర్ఎస్ ఖేల్ ఖతమే అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు.. అధికార పక్షం పాలనా తీరుపై ఎందుకు ప్రశ్నించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణం ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో కాంగ్రెస్ శ్రేణులను కేసీఆర్ ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీలో ఉండటంతో కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్లేందుకు భయపడుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేసీఆర్ అసెంబ్లీకి వెళితే.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను టార్గెట్ చేయడం ఖాయం. ఈ క్రమంలో పదేళ్ల పాలనలో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు చేసే అవకాశం ఉంది. కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ తప్పనిసరిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో కేసీఆర్ ను అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సభ్యులు అవమానిస్తారని అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కొందరు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ముందుగానే ఎందుకు అలా భయపడుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి నేర్చుకో కేసీఆర్ అంటూ కొందరు సోషల్ మీడియాలో సూచనలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును వైఎస్ జగన్, వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అవమానించారు. అయినా, ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు. తనకు సాధ్యమైనంత స్థాయిలో జగన్, వైసీపీ సభ్యులకు అసెంబ్లీలో గట్టిగా ఎదురొడ్డి నిలబడ్డారు. చివరికి తన భార్య విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో మనస్తాపానికి గురైన చంద్రబాబు.. సీఎం హోదాలోనే అసెంబ్లీలోనే అడుగు పెడతానని శపథం చేశాడు. అన్నట్లుగా ఎన్నికల్లో గెలిచి సీఎం హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే, చంద్రబాబు తరహా రాజకీయాలు కేసీఆర్‌కు అబ్బలేదు. ప్రజల సమస్యలపై ప్రస్తావించడం కంటే తన పరువు మర్యాదలే ముఖ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ తీరుపట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సైతం ఒకింత ఆగ్రహంతో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/kcr-learn-from-cbn-39-181740.html





