అనుకున్నదొకటి ..అయినది ఇంకొకటి.. కేసీఆర్ బీహార్ యాత్ర
Publish Date:Sep 1, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, బీహార్ వెళ్ళారు. ఈ మధ్యనే బీజీపీతో తెగతెంపులు చేసుకుని, మహా ఘటబంధన్’(ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి)తో జట్టుకట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి లాలూ రబ్రీ తనయుడు తేజస్వి యాదవ్’తోనూ సమావేశమయ్యారు. అవును,ముఖ్యమంత్రి బీహార్ వెళ్ళింది, గుల్వాన్ ఘర్షణలలో అమరులైన ఇద్దరు బీహారు అమరజవానుల కుటుంబాలకు, అదే విధంగా, ఇటీవల సికింద్రాబాద్’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకే, అయినా, అసలు పని మాత్రం అది కాదు. అది స్వామి కార్యం, స్వ కార్యం రాజకీయం. అదే కోణంలో చూసినప్పుడు, కేసీఆర్ పాట్నా పర్యటన ఆశించిన లక్ష్యం సాధించక పోగా, ఇంటా బయట కొత్త సమస్యలకు శ్రీకారం చుట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి కేసీఆర్ ఇప్పటికే సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏ ముహూర్తాన, ఎందుకోసం ఆయన, జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్నారో, అందుకోసంగా ఏ క్షణాన కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారో గానీ, ఆక్షణం నుంచి ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రాజకీయాలు ఆయనకు ఏమాత్రం అచ్చిరావడం లేదు. అంతే కాదు, ఆయన జాతీయ రాజకీయ ప్రయత్నాలు, సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చింది అన్న రీతిన, కేసీఆర్ ఏరాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో రాజకీయం తలకిందులు అవుతోంది. ప్రభుత్వాలు సంక్షోభంలో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. మహా రాష్ట్ర విషయాన్నీ తీసుకుంటే, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వుంది, అయినా ఫలితం లేక పోయింది.కానీ, కేసీఆర్ ఇలా ముంబై వెళ్ళి అలా శివసేన ఆధినేత ముఖమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత సరద పవార్ తో చర్చలు జరిపి వచ్చారు.ఈ మొత్తం వ్యవహారంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్’తో పోటీపడి మోడీ పై ఒంటి కాలు పై లేచారు. నెలరోజులు తిరక్కుండానే, ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి పోయింది. సంజయ్ రౌత్ జైలు పాలయ్యారు.అలాగే, జార్ఖండ్ ముఖ్యమంత్రి, సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్’ కూడా కేసీఆర్’ను కలిసిన తర్వాతనే రాజకీయ రాజకీయ చిక్కుల్లో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టాలనే ఆలోచనను బయట పెట్టారో, అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆయన చుట్టూ ఉచ్చులు బిగిస్తోంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని పాటిస్తోంది. కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ అవినీతి టార్గెట్ గా అస్త్రాలను సంధిస్తోంది. నిజానికి బీజేపీ, ఒక్క కేసీఆర్ తెరాస విషయంలోనే కాదు, ఎక్కడెక్కడ బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్నాయో, అక్కడక్కడల్లా, ముఖ్యంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తోంది. అయితే ఐటీ కాదంటే సీబీఐ అదీ కాదంటే ఈడీ అస్త్రాలను సంధించి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. మహారాష్ట్రలో శరద్ పవార్ అంతటి ఉద్దండ నేత పౌరోహిత్యంలో నడుస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీ, శివ సేన కూటమి,(మహా వికాస్ అఘాడీ) కూటమి ప్రభుతాన్ని కూల్చేసింది. అలాగే, మోడీ మీద పులిలా రంకెలు వేసిన మమతా బెనర్జీ, ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. పార్థా చటర్జీ అవినీతి ‘భాండాగారం’ బయట పడిన తర్వాత ఆమె సైలెంట్ అయి పోయారు. అదే విధంగా ఓవంక ఢిల్లీలో మరో వంక ఝార్ఖండ్ లో హై డ్రామా నడుస్తోంది. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మూడు నెలలుగా జైల్లో ఉన్నారు. మరో వంక, మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పీకలలోతున కురుకుపోయారు. రేపో మాపో ఆయన కూడా జైలుకు పోవడం ఖాయమని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘంటాపథంగా చెపుతున్నారు. ఈ స్కాంలో సీబీఐ 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1 గా మనీష్ సిసోడియా ఉన్నారు. ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.దేశ వ్యాప్తంగా సంచలనమైన ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తున్న ఢిల్లీ బీజేపీ ఎంపీ.. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పుడు బీహార్ పర్యటన కూడా అందులో భాగమే, అయినా ఫలితం మాత్రం లేదు. ఇక్కడ ప్రగతి భవన్ లో తెలుగులో చెప్పిన కథనే అక్కడ పాట్నాలో,బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పక్కన కూర్చోపెట్టుకుని చెప్పుకొచ్చారు, కానీ నితీష్ కుమార్ విన్నంతవరకు విని చెప్పింది చాలని లేచి పోవడంతో, కేసీఆర్ ఇజ్జత్ పోయిందని అంటున్నారు. ఇంతకు ముందు ఝార్ఖండ్ వెళ్ళినప్పుడు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే లేచి పోయారు. సో .. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు అచ్చిరాలేదు అని మరో మారు రుజువైంది. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు ఇంట ఓడి రచ్చ గెలవాలంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.
మరో వంక కొంత కాలంగా కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గత ఎనిమిది ఏళ్లుగా సాగిన అవినీతి, అక్రమాలు బయటికి తీస్తున్నామని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా, ఇది, ఇది కాకపోతే అది, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ,ఆయన కుటుంబ అవినీతి పై ఫోకస్ పెట్టింది. సో, ఈ గండం నుంఛి బయట పడేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరున రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-bihar-tour-failed-to-achieve-what-he-hope-25-143040.html





