కొత్త ఫ్రంట్ కాదు.. జస్ట్ అజెండానే.. కేసీఆర్ పీచేముడ్!
Publish Date:Apr 27, 2022

Advertisement
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా గులాబీ బాస్ కొత్త జాతీయ కూటమి ప్రకటిస్తారని అనుకున్నారు. కొత్త ఫ్రంట్ కాకపోయినా.. కనీసం నేషనల్ పాలిటిక్స్‌పై క్లారిటీ అయినా ఇస్తారనుకున్నారు. ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కీలక మంథనాలు జరిపారు. ఢిల్లీలో గప్‌చుప్ మీటింగులు, పలు రాష్ట్రాల పర్యటనలు, పలువురు నేతలతో మారథాన్ మీటింగ్‌లు, ప్రగతి భవన్‌లో ముచ్చట్లు.. కొన్ని నెలలుగా ఇదే పని మీద ఉన్నారు గులాబీ బాస్. ఆ వర్కవుట్ అంతా కొలిక్కి వచ్చి.. కారు పార్టీ ప్లీనరీలో ఓ స్పష్టమైన ప్రకటన చేస్తారంటూ ప్రచారం జరిగింది. పలు మీడియాల్లో సైతం ఫోర్త్ ఫ్రంట్‌పై కేసీఆర్ అనౌన్స్‌మెంట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కేసీఆర్ స్పీచ్‌ను చాలామంది ఆసక్తిగా విన్నారు. అయితే, సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన.. జాతీయ కూటమిపై తుస్సు మనిపించారు. ఫ్రంటు లేదూ పాడూ లేదూ అనేలా.. డిఫెన్స్ మోడ్‌లో మాట్లాడారు. కేంద్రంపై, బీజేపీపై విమర్శల డోసు ఎక్కడా తగ్గించకుండానే.. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చూస్తూనే.. నీతులు, సూచనలు చెబుతూ.. మార్పు రావలని కోరుకుంటూ.. నాన్‌స్టాప్‌గా మాట్లాడారు గులాబీ బాస్. కానీ, ఎక్కడా.. తాను ముందుంటానని కానీ, మరో ఫ్రంట్ పెడతానని చెప్పలేదు. అసలు ఫ్రంట్‌లు, రాజకీయ పునరేకీకరణలు అవసరం లేదంటూ చేతులెత్తేయడం ఆసక్తికరంగా మారింది.
అవును, కొత్త ఫ్రంట్‌లు అవసరం లేదన్నారు కేసీఆర్. అవును, రాజకీయ పునరేకీకరణ కూడా అక్కరలేదని చెప్పారు. ఇన్నాళ్లూ ఏ జాతీయ కూటమి కోసమైతే గులాబీ బాస్ తెగ చర్చలు జరిపారో.. దేశమంతా తిరిగి.. ఎవరెవరినో కలిసి.. ఏదో చేసేస్తానని ప్రగల్బాలు పలికారో.. తీరా ఆ సమయం వచ్చే సరికి.. ప్లీనరీలో చేతులెత్తేశారు. కావలసింది జాతీయ కూటమి కాదని.. జాతీయ అజెండా కావాలంటూ.. వెనకడుగు వేశారు. హైదరాబాద్ వేదికగా కొత్త అజెండాకు ముందడుగు పడితే ఆనందం అంటూ డొంకతిరుగుడుగా మాట్లాడారు. అంటే, కొత్త ఫ్రంట్‌పై కేసీఆర్ పీచేముడ్ అన్నట్టే అంటున్నారు.
కావొచ్చు. కేసీఆర్‌తో కలిసిరామని, గులాబీ బాస్‌ను నమ్మలేమని.. మిగతా ప్రాంతీయ పార్టీలు, నేతలు ముఖం మీదే చెప్పేశాయి కావొచ్చు. మమత నుంచి స్టాలిన్ వరకూ.. ఎవరూ ఆయనతో కలిసి ముందుకొచ్చేందుకు సిద్ధంగా లేరు మరి. అన్ని రాష్ట్రాలు తిరిగొచ్చినా, అంత మందితో మాట్లాడినా.. ఎవరూ కేసీఆర్ మాటలను నమ్మట్లేదట. గులాబీ బాస్ బుట్టలో పడేందుకు అమాయకులెవరూ దొరకలేదట. రెండు రోజుల మారథాన్ మీటింగ్‌లో ప్రశాంత్ కిశోర్ సైతం కేసీఆర్‌కు ఇదే విషయం అర్థమయ్యేలా చెప్పారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీని, బీజేపీని దెబ్బకొట్టడం అంత ఈజీ కాదని.. కాంగ్రెస్ అండాదండా లేకుండా.. టీఆర్ఎస్ సొంతంగా ఏమీ చేయలేదని.. క్లారిటీగా చెప్పేశారని తెలుస్తోంది. కేసీఆర్‌కు జాతీయ రాజకీయ తత్వం బోధపడేలా.. చాలా వివరంగా, ప్రాక్టికల్‌గా జ్ఞానోదయం చేశారట పీకే. అందుకే, గులాబీ బాస్‌లో ఈ మార్పు. జాతీయ ఫ్రంట్‌పై వెనకడుగు. ఫ్రంట్లు అవసరం లేదని.. కావలసింది కొత్త అజెండా అంటూ సూక్తులు చెప్పి.. తగ్గేదేలే అంటూ తగ్గేశారు కేసీఆర్.. అని విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-back-step-on-new-front-25-135057.html












