కేసీఆర్ కొత్త ఆలోచన ఫ్రంట్ కాదు పార్టీనే ..
Publish Date:Apr 22, 2022
Advertisement
గిరీశం ఏమంటే మనకెందుకు కానీ, అవసరాలకు అనుగుణంగా ఒపినియన్స్ మార్చుకోవడం రాజకీయ నాయకుల జన్మ హక్కు. ఒపినియన్స్’మార్చుకుంటేనే రాజకీయాల్లో నిలబడగలుగుతారు.కాదని, పిడివాదాన్నే నమ్ముకుంటే కమ్యూనిస్ట్ పార్టీల్లా కనుమరుగై పోతారు. కేసీఆర్, కమ్యూనిస్ట్ కాదు. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ నాయకుడు. సో .. ఒపినియన్స్ మార్చుకునేందుకు ఆయన ఏ మాత్రం వెనకాడరు. అందులోనూ జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో ఆయన కీడెంచి మేలెంచే పద్దతిలో ఇప్పటికే కర్చీఫ్’ కూడా వేసి ఉంచారు. కాబట్టి. అసలు సమస్యే లేదు.
అవును మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కొత్త ఆలోచన గురించే. నిన్న మొన్నటి దాకా కేసీఆర్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.అందుకోసం తమిళనాడు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిఎంకే అద్యక్షుడు స్టాలిన్’ ని కలిశారు. మంతనాలు సాగించారు. ముంబై వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివ సేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసి ఫ్రంట్ ఏర్పాటు పై చర్చలు జరిపారు. ఝార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్’ తోనూ చర్చలు జరిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’ను కూడా కలవాలని అనుకున్నారు కానీ, ఆయన తలుపులు తీయలేదు. ఓ నాలుగైదు రోజులు వెయిట్ చేసి, వెనక్కి వచ్చేశారు.అదొకటి అలా ఉంటే, ఫ్రంట్’కు ప్రాణం పోస్తారని అనుకున్న, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ తమ వ్యూహం మార్చుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కేసీఆర్’కు జెల్ల కొట్టి కాంగ్రెస్ గూటికి చేరారు.
మరోవంక ప్రాంతీయ పార్టీలు ఏవీ కేసీఆర్ రూట్లో కాంగ్రెసేతర, బీజేపేతర ఫ్రంట్ కట్టేందుకు సిద్డంగా లేవు. బీజీపీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సారధ్యంలో ఉమ్మడి పోరాటం చేయాలనే, ప్రతిపాదన వైపే తృణమూల్, ఎన్సీపీ, డిఎంకే సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. సోనియా గాంధీ, మమతా బెనర్జీ సహ పదమూడు మంది బీజేపేతర పార్టీల ముఖ్యనేతలు, బీజేపీ హిందుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఉమ్మడి పోరాటానికి కలిసి రావాలని పిలుపు నిచ్చారు.దీంతో ఇప్పుడు కేసీఆర్, జాతీయ రాజకీయాలకు సంబందించినంత వరకు ఒంటరి అయిపోయారు.
దీంతో కేసీఆర్ పరిస్థితి అటూ ఇటూ ఎటూ కాకుండా పోయిందని అంటున్నారు. అందుకే ఆయన ఇప్పుడు,గతంలో ఒకటి రెండు సందర్భాలలో అవసరం అయితే, జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటనకు కొనసాగింపుగా, జతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
నిజానికి, కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కేసీఆర్’కు పెద్దగా అభ్యంతరం ఉండక పోవచ్చును. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయితే ఏమూ కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అది వర్కౌట్ క్కపోవచ్చును. రాష్ట్రంలో తమ కుటుంబ పాలన కొనసాగించాలంటే, కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం అవసరం. అందుకే, కేసీఆర్ ప్రస్తుతానికి ఫ్రంట్’ ను పక్కన పెట్టి, రాష్ట్రంలో ముక్కోణపు పోటీని నిలబెట్టేందుకు జాతీయ పార్టీ తెరపైకి తెచ్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, థర్డ్ ఫ్రంట్ లానే, జాతీయ పార్టీ కూడా ఎప్పటికీ వాస్తవ రూపం దాల్చదని, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫ్రంట్ అటకెక్కినట్లే , 2023 ఎన్నికల తర్వాత జాతీయ పార్టీ అటకెక్కుతుందని, అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr--new-idea-thinks-of-floating-national-party-25-134773.html