కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్?
Publish Date:May 8, 2026
Advertisement
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ముఖ్యమంత్రి రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయనకు పట్టాభిషేకం చేసేందుకు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి. గత కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వేణుగోపాల్.. ఇప్పుడు తిరిగి సొంత రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని క్లిష్ట సమయాల్లో సమన్వయం చేయడంలో ఆయన చూపిన చొరవను అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను కేరళ సీఎంగా పంపేందుకు ఏఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్రస్థాయిలో మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వి.డి. సతీశన్ వంటి నేతలు రేసులో ఉన్నారు. అయితే , పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్ కు మద్దతు తెలిపారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. గతంలో ఉమెన్ చాందీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం వేణుగోపాల్‌కు ఉంది. అప్పట్లోనే ఆయన తనదైన శైలిలో పాలన సాగించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో, కేరళ అభివృద్ధికి ఆయన నాయకత్వం అవసరమని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, అధికార ఎల్డీఎఫ్ పరాజయానికి ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నేత బాధ్యతలు చేపడితే రాష్ట్ర ప్రయోజనాలకు మేలు జరుగుతుందని మద్దతుదారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం పరిశీలకులను కేరళకు పంపింది.ఏఐసీసీ పరిశీలకులుగా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు స్వీకరించి, ఆ నివేదికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు శుక్రవారం ( మే8) అందజేశారు.
http://www.teluguone.com/news/content/kc-venugopal-kerala-cm-39-219268.html





