ఆపండయ్యా మీ మోసాలు!
Publish Date:Nov 17, 2013
Advertisement
సీమాంధ్రులు తమ సమస్యలకు అసలు కారకులు విభజనవాదులు అనుకుంటున్నారుగానీ, నిజానికి అసలు కారకులు ఎవరో కాదు.. సీమాంధ్ర కేంద్రమంత్రులు! తమను గెలిపించి కేంద్రానికి పంపిన తమ సొంత ప్రాంత ప్రజల్నే దారుణంగా మోసం చేసి రాష్ట్రాన్ని విభజన వరకు తీసుకొచ్చారు. తమను నమ్మినవాళ్ళని దారుణంగా మోసం చేశారు. ఇక్కడ సీమాంధ్రులందరూ రోడ్లమీదకి చేరి ఆందోళనలు చేస్తుంటే వాళ్ళంతా ఢిల్లీలో కూర్చుని రాష్ట్రాన్ని ఏరకంగా విభజిస్తే బాగుంటుందో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇప్పటి వరకూ తాము చేసిన మోసాలతో సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. సీమాంధ్రులను ఇంకా మోసం చేసి కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. అందులో మొదటి స్థానంలో నిలిచే మంత్రిగారు ఘనత వహించిన కావూరి సాంబశివరావు గారు. మంత్రి పదవి వచ్చే వరకూ సమైక్యాంధ్ర అంటూ వీరంగాలు వేసిన ఆయన మంత్రి పదవి వచ్చాక గోడమీద పిల్లిని గుర్తుచేస్తూ అధిష్ఠానం దగ్గర మ్యావ్ అన్నారు. రాజకీయ నాయకులు ఎంత ఫాస్టుగా ప్లేటు ఫిరాయించగలరో స్పష్టంగా చూపించారు.
ఇప్పటికీ ఆయన సీమాంధ్రులకు మెత్తటి మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. విభజన ఘట్టాన్ని క్లైమాక్స్ వరకూ పట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు తీరిగ్గా విభజన ఏ దశలో అయినా ఆగే అవకాశం వుందని చెబుతూ సీమాంధ్రుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ పర్యటనకు వచ్చిన ఆయన సీమాంధ్రులు తనను టెన్షన్ పెట్టకుండా వుండటం కోసం ఇలాంటి రెడీమేడ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఆయనగారు ఇచ్చిన స్టేట్‌మెంట్ విని మురిసిపోయిన సీమాంధ్రులు ఆయనకు అతిథి సత్కారాలు చేసి పంపించారు.
కావూరిగారు ఇంకా చాలా గొప్ప రహస్యాలు వెల్లడించారు. రాష్ట్రం నుంచి తప్పుడు సమాచారం వెళ్ళడం వల్లే ఢిల్లీ పెద్దలు తప్పుగా అర్థం చేసుకుని రాష్ట్ర విభజనకు పూనుకున్నారట. తాను, ఇతర కేంద్రమంత్రులు ఈ నిర్ణయాన్ని మార్చడానికి కృషి చేస్తున్నారట. హలో కావూరీ అండ్ కేంద్ర మంత్రులూ.. ఇప్పటికైనా మీ మోసాలు ఆపండయ్యా.. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్ళిందంటున్నారుగా.. ఆ సమాచారం ఇచ్చింది వేరెవరో కాదు.. మీ గోడమీద పిల్లుల గ్యాంగే అయి వుంటుంది.. నో డౌట్!
http://www.teluguone.com/news/content/kavuru-samba-siva-rao-39-27519.html





