క.వి.త అంటే?
Publish Date:Jan 7, 2026
Advertisement
క. కల్వకుంట్ల కుటుంబానికి చెందిన కవిత.. ప్రొఫైల్ చూస్తే ఆమె తనకు తాను చెప్పే మాట.. కేసీఆర్, ప్రొ. జయశంకర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి.. అటు పిమ్మట జాగృతి అనే క సంస్థ ఏర్పాటు చేశాననీ, అప్పటి వరకూ అనాథగా ఉన్న బతుకమ్మను తన నెత్తికి ఎత్తుకుని దేశ విదేశాల్లో ఫేమస్ చేశానని అంటారు కవిత. ఇక ఉద్యమ కాలంలో ఆమె జాగృతి పేరిట బాగా పాపులర్ అయ్యారు. ఏది ఏమైనా కల్వకుంట్ల కవితగా స్థిరపడ్డారు. ఉద్యమ యత్నం ఫలించి.. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటంతో.. తాను కూడా ఎంపీగా ప్రమోట్ అయ్యారు. ప్రమోషన్ లభించిన తర్వాత కవిత.. ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు. దీంతో ఆమెను ఎమ్మెల్సీని చేసింది పార్టీ. తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంపీ కవిత నుంచి ఎమ్మెల్సీ కవితగా మారారు. ఇంతలో పార్టీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం.. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావడంతో.. అతి ప్రధానమైన ఘట్టం ముగిసినట్టయ్యింది ఆమె రాజకీయ జీవితంలో. దీంతో తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ తండ్రికి లేఖ రాశారు కవిత. ఇది బయట పడ్డంతో మొత్తం గేమ్ ఛేంజర్ గా మారిపోయింది. ఈ వివాదం తర్వాత పార్టీకి, పదవులకు రాజీనామా ఇచ్చి బయటకు వచ్చేశారు. తన తట్టా బుట్టా సర్దేసుకుని.. ఇకపై తాను బీఆర్ఎస్ కవిత కాదు.. జాగృతి కవిత అంటూ స్వయం ప్రకటనలు చేశారు. వి. అంటే విడిపోవడం. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవడం. కవిత జీవితంలో ఇది అత్యంత కీలకమైన మలుపు. ఎప్పుడైతే ఆమె పార్టీ నుంచి బయటకొచ్చారో అప్పటి నుంచీ కాంగ్రెస్ కన్నా మించి బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. మరీ ముఖ్యంగా తన బావ హరీష్ ని చెడుగుడు ఆడుకున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ ని బబుల్ షూటర్ అంటూ అవహేళన చేశారు. హరీష్ రాజకీయ గిమ్మిక్కులన్నిటినీ ఎండగట్టారు. పార్టీకి అతి పెద్ద అడ్డంకి హరీష్ రావ్ అంటూ తూర్పార బట్టారు. ఇక కాళేశ్వరం అవినీతి మొత్తం హరీష్ రావు పాపమే అంటూ దుయ్యబట్టారు. అంతేనా ఇటు సోదరుడు కేటీఆర్, ఇంకో బావ సంతోష్ వంటి వారిని కూడా వదలకుండా తీవ్ర ఆరోపణలు చేశారు. వీటితో పాటు.. బీఆర్ఎస్ లోని ఎందరో ఎమ్మెల్యేలపై భూకబ్జా ఆరోపణలు చేసి వివాదాస్పదం అయ్యారు. జాగృతి జనం బాట అంటూ తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు చేసి.. బీఆర్ఎస్ లీడర్లపై, మరీ ముఖ్యంగా హరీష్ పై విమర్శలు గుప్పించారు. ఒక సమయంలో కాంగ్రెస్ లీడర్లు చేయాల్సిన పని కవిత చేస్తున్నారా అన్న అనుమానం కలిగేలా ఆమె తీరు ఉంది. కాంగ్రెస్ లీడర్లు కూడా కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పమంటూ హరీష్, కేటీఆర్ లకు సవాల్ విసిరారంటే.. ఆమె విమర్శల ధాటి ఎంతగా ఉందో అర్ధమౌతుంది. అయితే తనది ఆస్తి కోసం పోరాటం కాదని ఆత్మగౌరవ పోరాటమనీ.. మండలిలో కన్నీటి పర్యంతమై కవిత.. ఎమోషనల్ హైడ్రామాకు తెరలేపారు. తన ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించమని కోరారు. అన్నట్టుగానే కవిత రాజీనామా ఆమోదం పొందింది. త. తన కాళ్లపై తాను నిలబడ్డానికి కొత్తగా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు కవిత. ఒక టైంలో గాంధీ భవన్ వైపు ఆమె అడుగులు పడుతున్నాయన్న మాట వినిపించినా.. 2028 ఎన్నికల్లో తన పార్టీ అయితే ఎన్నికల బరిలో దిగడం ఖాయమని చాటారు కవిత. తనది ఆత్మగౌరవ పోరాటమంటోన్న కవిత.. కాంగ్రెస్- బీజేపీ- బీఆర్ఎస్ వంటి హేమా హేమీల ముందు రాజకీయంగా ఎంత మేరకు రాణించగలరు? ఆమె చిరకాల వాంఛ సీఎం కావడం సాధ్యమయ్యే పనేనా? లేక షర్మిళలా ఆమె కూడా తేలిపోతారా? అన్నది కవిత తదుపరి కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. ఆమె వెనక నడిచే నాయకత్వాన్ని బట్టి భవిష్యత్ రూపు దిద్దకుంటుంది.
http://www.teluguone.com/news/content/kaviyha-political-journey-39-212177.html





