కవిత రూటేంటి? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ సంకేతమేంటి?
Publish Date:Jun 14, 2025

Advertisement
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూటేంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ లో దయ్యాలు చేరాయంటూ, సొంత అన్న టార్గెట్ గా విమర్శలు గుప్పించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? తెలంగాణ జాగృతినే నమ్ముకుని రాజకీయంగా ఎదగడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకూ బీఆర్ఎస్ కు తాను దూరం అన్నట్లుగా వ్యవహరించిన కవిత ఇప్పుడు మాత్రం తాను బీఆర్ఎస్ నేతనే అని చెప్పుకునేందుకు నానా యాతనా పడుతున్నారు.
నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లో కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించనని విస్పష్టంగా ప్రకటించిన ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె7సిడెంట్ కు నోటీసులు ఇస్తారా అంటూ ఫైర్ అయిపోతున్నారు. కేసీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఆమె ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కవిత.. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కేటీఆర్ కు ఏపీసబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తే.. కేటీఆర్ కు మద్దతుగా కవిత ఈ పోస్టు పెట్టారు. గతంలో కూడా కవిత కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించినా.. ఈ సారి ఖండన మాత్రం భిన్నంగా ఉంది. గతంలో కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన కవిత.. దాదాపుగా బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నట్లుగా వ్యవహరించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టిన సమయంలో కానీ, తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభ సమయంలో కానీ ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇటీవల మీడియాతో చిట్ చాట్ అంటూ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కు పార్టీని నడపడం చాతకావడం లేదంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నట్లుగా మాట్లాడారు.
ఇంత మాట్లాడిన ఆమె తన తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకున్నారు. అయితే తాజాగా అంటే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కేసీఆర్ ఆమెతో కనీసం మట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో తత్వం బోధపడిన కవిత.. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకోవడానికే ఇప్పుడు రూటు మార్చి అన్న కేటీఆర్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాననీ, కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం లేదనీ చాటేందుకే కేటీఆర్ ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని సంబోధించారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kavitha-uturn-on-ktr-leadership-39-199898.html












