క‘ర్ణాటకం’మళ్ళీ మొదటికి!?
Publish Date:Jul 9, 2025
Advertisement
కర్ణాటకం మరోమారు తెరపై కొచ్చింది. నిజానికి.. కర్ణాటకలో రెండేళ్ళ క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కౌన్ బనేగా ముఖ్యమంత్రి అనే సీరియల్ తెర పైకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సంధి కుదిర్చింది. ఇద్దరు చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిర్చి అప్పటికి ఆ సమస్యను పరిష్కరించింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా,డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా.. కారణాలు ఏవైనా ఈ రెండు సంవత్సరాలలో ఇద్దరి మధ్య సంబంధాలు అంత సజావుగా లేవనే విషయంలో ఎలాంటి దాపరికం లేదు. అదలా ఉంటే.. ఫిఫ్టీఫిఫ్టీ పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ప్రకారం సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవలసిన సమయం ఆసన్నం అవుతున్న నేపధ్యంలో గత కొంతకాలంగా ముఖ్యమంత్రి మార్పుఅంశం రాష్టంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రముఖంగా చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనే వార్తలు కూడా ప్రముఖంగా వినిపించాయి. చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా.. ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని చెప్పడం ద్వారా సీఎం మార్పు తప్పక పోవచ్చన్న సంకేతాలు ఇచ్చారు. అయితే.. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని ఇష్యూని సెటిల్ చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాను రంగంలోకి దించింది. ఆయన మూడు నాలుగు రోజులు బెంగుళూరులో కూర్చుని, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. సంప్రదింపులు జరిపారు. చివరకు అధిష్టానం అనుమతి, ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని, ఐదేళ్ళు సిద్దరామయ్య ఒక్కరే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారనీ.. అదే అధిష్టానం నిర్ణయమనీ ప్రకటించారు. నిజానికి.. ఇది ఒక విధంగా డీకే శివకుమార్ వర్గం ఆశించని, ఆ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడని నిర్ణయం. డీకే వర్గమే కాదు.. జరుగతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేశకులు కూడా ముఖ్యమంత్రి మార్పు ఎంతో దూరంలో లేదు, త్వరలోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమనాలు అవసరం లేదని మీడియా సాక్షిగా ప్రకటించారు. అందుకే అధిష్టానం నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయినా.. డీకే శివకుమార్ మాత్రం ఏం చేస్తాం, అధిష్టానం చెపితే వినాలి అన్న ధోరణిలో సిద్దరామయ్య ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని స్వయంగా ప్రకటించారు. అక్కడితో కర్ణాటకం కథ ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే పరిస్థితి మళ్ళీమొదటికి వచ్చిందని అంటున్నారు. నిజానికి.. ఇప్పటికీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్నారు. కానీ, తాజా పరిణామాల నేపధ్యంలో ఆయనకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఐదేళ్లూ సిద్దరామయ్యే ముఖ్యమంత్రి అని చెప్పిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని ఆశించడంలో తప్పులేదు కదా అంటూ సీఎం కావాలనే తమ మనసులోని ఆశను మరో మారు బహిరంగంగా బయట పెట్టారు. దీంతో మరోమారు ముఖ్యమంత్రి మార్పు అంశం పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ నేపధ్యంలోనే.. తాజాగా డీకే శివకుమార్ అనుకూల వర్గానికి చెందిన ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్.. ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని మరో మారు తెరపైకి తెచ్చారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల మద్దతు డీకే శివకుమార్ కే ఉందని చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజలు ఇదే కోరుకుంటున్నారని యోగేశ్వర్ అన్నారు. అయితే.. నిర్ణయం మాత్రం అధిష్ఠానం చేతిలో ఉందన్నారు. డీకేకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మరో నేత చెప్పుకొచ్చారు. దీంతో సుర్జేవాల్ దౌత్యంతో పరిష్కారం అయిన ముఖ్యమంత్రి వివాదం.. మళ్లీ మొదటికి వచ్చింది. నిజానికి.. ఇప్పుడు కూడా ఈ వివాదం కూడా టీ-కప్పులో తుపానులా సమసి పోతుందని అనుకున్నా.. కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు నేతలను గురువారం( జూలై 10) ఢిల్లీ రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదో జరగబోతోందన్న ఉత్కంఠకు తెరతీసింది.
http://www.teluguone.com/news/content/karnataka-congress-politics-on-cm-chair-39-201596.html





