కాపు నేస్తంకు అవినీతిపరుడైన వైఎస్సార్ పేరేందుకు?
Publish Date:Jun 16, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలన్ని వైఎస్ కుటుంబం పేర్లతోనే ఉన్నాయి. గత రెండేండ్లలో మొదలుపెట్టిన అన్ని పథకాలకు వైఎస్సార్, జగనన్న పేర్లతోనే ప్రారంభించారు. అంతేకాదు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల పేర్లు కూడా మార్చి.. వైఎస్ కుటుంబం పేర్లతో నింపేశారు. ఏపీలో జరుగుతున్న వైఎస్ జపంపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయినా జగన్ రెడ్డి సర్కార్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు. కాపు నేస్తానికి వైఎస్ఆర్ కాపు నేస్తం అని పేరు పెట్టారు. దీనిపై ఆ వర్గం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఏపీ సర్కార్ కాపులను అవమానించిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాపు నేస్తానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం సరికాదని ఏపీ సీఎం జగన్ కు కాపు ఉద్యమ నేత, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్ పేరు పెడితే కాపులకు అవమానమని అన్నారు. వెంటనే ఆ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించాలని వేల్పూరి డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిత్య అసమ్మతి వాది అని, దేశంలో అత్యంత అవినీతి పరుడైన రాజకీయ నాయకుడని తన లేఖలో వేల్పూరి చెప్పారు. వైఎస్ అవినీతి కారణంగా పది మంది IAS, IPS అధికారులు జైలుకు వెళ్లారని జగన్ కు ఆయన గుర్తు చేశారు. చిరంజీవి పై పులివెందుల, తిరుపతిలో దాడులు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాముడు, ఎమ్ ఎల్ సి చెంగలరాయులు, మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య ఇంటిపై దాడి, తిరుపతి మాజీ శాసన సభ్యులు వెంకటరమణపై, ఒంగోలు గ్రానైట్ వ్యాపారి డాక్టరు ఆనంద్ పై, చిత్తూరు జిల్లా బలిజ ఉద్యమ నేత కటారి మోహన్ల పై దాడులకు పాత్రధారి, సూత్రధారి వైఎస్సార్ అన్న విషయం ప్రజలందరికి తెలుసన్నారు వేల్పూరి శ్రీనివాసరావు. 2004,2009 లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించినా సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నది వాస్తవం కాదా అని జగన్ ను సూటిగా వేల్పూరి ప్రశ్నించారు. కాపుల సర్వే కోసం ఒక్కరూపాయి కూడా ఇవ్వని కాపు వ్యతిరేకి వైఎస్ పేరు కాపు నేస్తంకు పెట్టడం సరికాదన్నారు. సామాజిక ఉద్యమ వీరుడు మహాత్మా జ్యోతిరావు పూలే, మొదటి మహిళా ఉద్యమ నేత సావిత్రి బాయి పూలే, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, కాన్షీరాం , సర్దార్ వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణ దేవరాయలు, నరేంద్ర మోడీ, వంగవీటి మోహన్ రంగా, దళిత శిఖరం దామోదరం సంజీవయ్య, మొట్టమొదటి కాపు ఉద్యమ నేత మిరియాల వెంకట రావు పేర్లలో ఏదో ఒకటి కాపు నేస్తంకు పెట్టాలని సూచించారు. దెబ్బతిన్న కాపుల మనోభావాలను రక్షించాలని, కాపు భక్షకుడైన వైఎస్ఆర్ పేరును తక్షణం తొలగించాలని సిఎం జగన్ కు రాసిన లేఖలో వేల్పూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/kapu-leader-velpuri-open-letter-to-cm-jagan-on-kapu-nestham-scheme-39-117770.html





