కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?
Publish Date:Dec 31, 2025
Advertisement
బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు. కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం 2006 లో సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు. తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు. అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత.. తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె, మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు. ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది.
మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.
http://www.teluguone.com/news/content/kalvakuntle-kavitha-fighy-against-brs-to-new-heights-in-new-year-25-211834.html





