కవిత.. వాట్ నెక్ట్స్.. సర్వత్రా అదే చర్చ!
Publish Date:May 26, 2025
.webp)
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుట్ల కవిత మనసులో ఏముందో.. ఆమె భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏమిటో, ఏమో కానీ, ఆమె సంధించిన లేఖ మాత్రం సొంత పార్టీలో కంటే ప్రత్యర్ధి పార్టీలలోనే ఎక్కవ కలవరాన్ని సృష్టిస్తున్నట్లు ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
మరోవంక, కవిత నెక్స్ట్ మూవ్ ఏమిటి? ఆమె అడుగులు ఎటుగా పడుతున్నాయి.. అనే విషయంలో ఇటు మీడియాలో, అటు రాజకీయ పార్టీలలో విభిన్న కోణాల్లో జోరుగా చర్చకు జరుగుతోంది. ఒకప్పుడు వైఎస్సార్ కుమార్తె షర్మిల అన్న జగన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు, ఆమె చుట్టూ ఎంత రాజకీయ చర్చ జరిగిందో.. ఇప్పుడు కవిత తిరుగు బాటు (?) పై అంత కంటే ఎక్కువగానే రాజకీయ రచ్చ జరుగుతోంది. ఓ వంక షర్మిల బాటలోనే కవిత కూడా సొంత పార్టీ పెట్టి, అదే రూట్ లో కాంగ్రెస్ లో కలిపేస్తారనే వాదన రోజు రోజుకూ బలాన్ని పుంజు కుంటోందని అంటునారు. మరో వంక కవిత అదే రూటులో వెళ్ళక పోవచ్చనే అభిప్రాయం కూడా రాజకీయ చర్చల్లో అంతే ప్రముఖంగా వినిపిస్తోంది.
అయితే.. కవిత నాయన కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు, అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోలో చేసిన దయ్యాల వ్యాఖ్యలు, దానిపై కేటీఆర్ స్పందించిన తీరు, బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండవచ్చునని చేసిన మర్మగర్భ వ్యాఖ్యలు.. అలాంటి వారు తమంతట తాముగానే బయట పడతారంటూ కవిత పేరు ప్రస్తావించకుండానే ఆమె రేవంత్ రెడ్డి కోవర్ట్ కావచ్చనే విధంగా ఇచ్చిన సంకేతాలు, జరుగతున్న ఇతర పరిణామాలను గమనిస్తే.. ఆమె అడుగులు అటుగా అంటే గాంధీ భవన్ వైపుగా పడుతున్నాయనే అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయని అంటున్నారు. .
కవిత తన లేఖలో ప్రధానంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన తీరు తెన్నులు, మంచిచెడులు, మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగంలోని పాజిటివ్, నెగటివ్ అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, ఆమె బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల ధోరణితోనే కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషించినట్లు ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగంలో బీజేపీని అలా పైపైన ఒకటి రెండు పొడిపొడి మాటలతో వదిలేయడం, చిన్నిచిన్ని వాతలు మాత్రమే పెట్టి వదిలేయడం, తమ సహజ ధోరణిలో గట్టిగా తిట్టక పోవడం కవితకు నచ్చలేదు. బీజేపీని కేవలం రెండు నిముషాలు మాత్రమే టార్గెట్ చేశారేంటి డాడీ అంటూ ఆమె కేసీఆర్ కు వేసిన ప్రశ్నలో, కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీని, మోదీని బండకేసి ఉతికి ఆరేయ లేదనే బాధ వ్యక్తమైందని అంటున్నారు. అలాగే.. ఉర్దూలో ప్రసంగింక పోవడాన్ని, వక్ఫ్ బిల్లు ప్రస్తావన తేక పోవడాన్ని కూడా కవిత తప్పు పట్టారు. అలాగే, దండకారణ్యంలో నక్సల్స్ ఏరివేత, నక్సలిజం నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ ని ఆపి నక్సల్స్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేయడం బాగుందని, కేసీఆర్ ను కవిత మెచ్చు కున్నారు. ఇవేవీ కూడ బీజేపీకి రుచించే అంశాలు కాదు. బీజేపీతో కలిసి నడవాలని అనుకునే ఎవరూ ఇలాంటి ఎజెండాను ముందు పెట్టరు.
అంటే.. కవిత భవిష్యత్ ఎజెండా బీజేపీ వ్యతిరేక ఎజెండాగా ఉంటుందని చెప్పకనే చెప్పినట్లు అయింది. మరో వంక ఆమె కేసీఆర్ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించక పోవడాన్ని మెచ్చుకున్నారు. దీన్ని బట్టి చూస్తే, కవిత ఆలోచనలు కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నట్లు అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.
ఈ అన్నికంటే ముఖ్యంగా కవిత తెర పైకి తెచ్చిన సామాజిక తెలంగాణ అంశం రాహుల గాంధీ ప్రవచించిన, రేవంత్ రెడ్డి జపిస్తున్న కుల గణనకు దగ్గరగా ఉందని అంటున్నారు. అలాగే.. రాష్ట్రంలో కవిత కథ నడుస్తున్న సమయంలోనే, ఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సామాజిక న్యాయ సదస్సు నిర్వహించడం.. అందుకోసం ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను మూడో రోజు కొనసాగించడం.. మరో వంక కవిత అమెరికా నుంచి వచ్చి రెండు రోజులు అయినా ఇంతవరకు కేసీఆర్ ను కలవక పోవడం, ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని వస్తున్న వార్తలు గమనిస్తే, కవిత బీఆర్ఎస్ నుంచి అనివార్యంగా బయటకు రావలసి వస్తే ... కాంగ్రెస్ దగ్గరవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే.. ప్రస్తుతానికి కవిత ఎవరితోనూ చేతులు కలపక పోవచ్చని, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకున్న తర్వానే తుది నిర్ణయం ఉటుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-what-next-25-198747.html












