కేటీఆర్ క్లూలెస్.. కవిత డామినేట్స్!
Publish Date:Jan 6, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ను కవిత విమర్శలు ఫేడౌట్ చేస్తున్నాయా? ఆమె విమర్శలకు దీటుగా బదులివ్వడంలో బీఆర్ఎస్ తడబడుతోందా? సొంత అన్నపై కూడా కవిత నేరుగా విమర్శలు సంధిస్తున్నా.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మౌనం ఆ పార్టీ రాజకీయ పునాదులను కదిపేస్తోందా? అంటే ఔననే అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మండలి వేదికగా కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన ఉద్వేగభరిత ప్రసంగాన్ని సభలో బీఆర్ఎస్ సభ్యులు కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించకుండా మౌనంగా ఉండిపోవడం, మండలి చైర్మన్ సైతం సమయ నియమాన్ని పట్టించుకోకుండా ఆమె ప్రసంగాన్నికొనసాగించడానికి అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన వారైనప్పటికీ.. ఆ పార్టీని విమర్శలతో చెండాడేస్తున్న కవితను కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అదే సమయంలో కవిత తన భావోద్వేగ ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీలో తాను ఎలా అవమానాల పాలైనదీ, తనను ఎలా పక్కన పెట్టేశారు. ఎలా బయటకు పంపేశారు అన్న విషయాన్ని చాలా చాలా ఎమోషనల్ గా చెప్పారు. అదే సమయంలో తాను పార్టీకి చేసిన సేవలనూ ప్రస్తావించారు. ఆమె ఎమోషనల్ గా చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుకుంటే ఆమెకు సానుభూతి మరింత పెరుగుతుందన్న భయంతో బీఆర్ఎస్ సభ్యులు మౌనం వహించి ఉంటారని అంటున్నారు. అయితే సభలో తన చివరి ప్రసంగం చేసి ఇప్పుడు వ్యక్తిగా ఒంటరిగా వెడుతున్నా.. కానీ ఒక శక్తిగా మళ్లీ తిరిగొస్తానంటూ ఆమె సభను వీడారు. ఇక మండలిలో ఇదే ఆమె చివరి ప్రసంగం అనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్రసంగం ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం తథ్యమన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కవితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని వేలెత్తి చూపుతుంటే.. దానిని ఖండించడం మాని.. కవిత కూడా అవినీతికి పాల్పడ్డారన్నకోణంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే పరోక్షంగా బీఆర్ఎస్ హయాంలో కవిత చెప్పినట్లుగా అవినీతి జరిగిందని అంగీకరిస్తున్నటుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయంగా కవితను ఎలా ఎదుర్కొనాలన్న విషయంలో పార్టీలో గందరగోళం నెలకొందన్న విషయాన్ని ఈ పరిస్థితి తేటతెల్లం చేస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇక కేటీఆర్ పై నేరుగా కవిత విమర్శల వర్షం కురిపిస్తున్నా ఆయన నేరుగా స్పందించకపోవడం పొలిటికల్ గా కవితకు అడ్వాంటేజ్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. కవిత విషయంలో కేటీఆర్ క్లూ లెస్ గా ఉంటే.. కవిత మాత్రం బీఆర్ఎస్ ను డామినేట్ చేసి పోలిటికల్ మైలేజ్ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-dominates-where-ktr-clueless-45-212108.html




