స్మిత సభర్వాల్ పై చట్టపరమైన చర్యలకు కాళేశ్వరం కమిషన్ సిఫారసు!
Publish Date:Sep 1, 2025
Advertisement
ఇటీవలే లాంగ్ లీవ్ లో వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు కాళేశ్వరం ఉచ్చు గట్టిగానే బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో స్మితా సభర్వాల్ పాత్ర ఉందని కాళేశ్వరం అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. బ్యారేజీల వ్యవహారంలో స్మితా సభర్వాల్ తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్మితా సభర్వాల్ విచారణకు సంబంధించిన కీలక అంశాలను పొందుపరిచింది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు ఉంచారా? అన్న కమిషన్ ప్రశ్నించగా తొలుత అవును అని బదులిచ్చిన ఆమె తరువాత కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ లో మాత్రం తనకేమీ తెలియదని బుకాయించినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఆరోగ్యకారణాలు చూపుతూ లాంగ్ లీవ్ పై వెళ్లడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో సీఎంవో లో అడిషనల్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సభర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు కమిషన్ నివేదికలో ఆమె తీరును తప్పుపడుతూ పీసీ కమిషన్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీ ముందుకు రావడానికి ముందే ఆమె ఆరోగ్య కారణాలు చెబుతూ లాంగ్ లీవ్ లో వెళ్లారన్న చర్చ నడుస్తోంది.
http://www.teluguone.com/news/content/kaleswaram-commission-recomand-leagal-action-on-smitasabharwal-36-205378.html





