కడపలో వైసీపీ కాడెపట్టే నాయకులేరీ?
Publish Date:Nov 29, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీ పరిస్థితి కలవరం కలిగిస్తున్నది. పార్టీ అధినేతగా పార్టీ నేతలను, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడంలో ఆయన విఫలమౌతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని అంటున్నారు. ఎప్పుడైనా ఏదో ఓదార్పు యాత్ర అనో, తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటన అనో ఆయన బయటకు వచ్చినప్పుడు వినా.. మరే సందర్భంలోనూ పార్టీ రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి ఆయన సొంత జిల్లా కడపలోనూ కనిపిస్తోంది. ఇటీవల జగన్ కడప జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా జిల్లాలో కీలకంగా వ్యవహరించే పార్టీ నేతలు చాలా వరకూ జగన్ కు చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. అధినేత పర్యటనకే వారు డుమ్మా కొట్టారు. అరటి రైతుల పరామర్శ, వారితో ముఖాముఖీ ఇవన్నీ పక్కన పెడితే.. పార్టీ పరంగా ఆయన కడప పర్యటన అట్టర్ ప్లాప్ అన్న మాట సొంత పార్టీ నేతలు, శ్రేణుల నుంచే వస్తున్నది. వాస్తవంగా జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలను మోటివేట్ చేసి జిల్లాలో పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగేలా పరిస్థితిని చక్కదిద్దాలన్నదే ఆయన పర్యటన ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెప్పాయి. అయితే పార్టీ వ్యవహారాలపై మాట్లాడేందుకు జగన్ పెద్దగా సమయం కేటాయించకపోవడం వారంతా నిరాశపడ్డారని అంటున్నారు. జిల్లా వైసీపీలో క్యాడర్ పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్నది వాస్తవం. అలాగే నేతలు కూడా చాలా వరకూ ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ విషయాన్ని జగనే స్వయంగా పలు సందర్భాలలో చెప్పడమే కాకుండా వారిని యాక్టివ్ కావాలని ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. అయినా కూడా పార్టీ అధినేతగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేయలేని పరిస్థితులలో జగన్ ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్వయంగా జగనే పార్ట్ టైమ్ పొలిటీషియన్ లెక్కన నెలలో ఎక్కువ రోజులు బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడమే ఇందుకు కారణమని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kadapa-ycp--leaders-inactive-39-210195.html





