కడప ఉక్కు కర్మాగార నిర్మాణ పనులకు రంగం సిద్ధం
Publish Date:Jun 11, 2026
Advertisement
సీమవాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి జిల్లాలో అతి త్వరలో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనుల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని సున్నపురాళ్ళ పల్లె వద్ద జేఎస్ డబ్ల్యూ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఉక్కుకర్మాగారం శిలాఫలకం వేసిన ప్రాంతాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి,స్థానిక ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి, ఆ కంపెనీ ప్రతినిధులుకలిసి పరిశీలించారు. జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో 3500 ఎకరాల్లో రూ.8,800 కోట్లతో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు మూడేళ్ల క్రితం శిలాఫలకం వేయడం జరిగింది. అయితే.. ఈ కర్మాగార నిర్మాణం తొలిదశ కూడా ప్రారంభం కాకపోవడంతో ఈ ప్రాంతవాసుల కలను సాకారం చేసే దిశగా త్వరలో పరిశ్రమ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గతంలో జిందాల్ గ్రూపు సంస్థకు గత ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన భూములను కేటాయింపు, ఒప్పందాలు, ప్రస్తుత పరిస్థితులు, పరిశ్రమ నిర్మాణానికి కావాల్సిన అనుకులతలు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మొదలైన అంశాలపై కంపెనీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్చర్చించారు. శంఖుస్థాపన చేయనున్న చంద్రబాబు వీలైనంత త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ దిశగా కలెక్టర్ , జిందాల్ సంస్ధ ప్రతినిధులు ఏర్పాట్లను చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ప్లాంట్ సైట్ ప్రాంతంలో ఉన్న రెండు హెలిపాడ్ల స్థితిగతులను, మిగతా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే, జేఎస్ డబ్ల్యూ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించడంతో ముఖ్యమంత్రి పర్యటన దాదాపు ఖరారైనట్లు చెప్పుకోవచ్చు. ఈ కర్మాగారం నిర్మాణం కార్యరూపం దాల్చితే జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వడం, వేలాది మంది యువతకు మెండైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతుంది.
http://www.teluguone.com/news/content/kadapa-steel-plant-construction-work-36-222644.html





