విశాఖ ఎంపీగా కె.ఎ.పాల్ ఘన విజయం!
Publish Date:May 16, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతోపాటు అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా హోరాహోరీగా పోటీ నెలకొంది.. ఒక్క విశాఖపట్నం స్థానంలో తప్ప. ఎందుకంటే, ఈ స్థానం నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పోటీలో వున్నారు. దాంతో ఇక్కడ వార్ వన్‌సైడ్ అయిపోయింది. విశాఖ ఓటర్లు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్‌ని, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీరాణిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ లాంటి మిగతా పార్టీల అభ్యర్థులను గానీ, ఇండిపెండెంట్లను గానీ ఎంతమాత్రం లెక్కచేయలేదు. విశాఖ ఓటర్లందరూ గంపగుత్తగా కేఏ పాల్‌కి ఓటేశారు. ఈవీఎంలలో సీరియల్ నంబర్ 14, కుండ గుర్తు పక్కనే వున్న బటన్ నొక్కేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా కేఏ పాల్ విజయం కన్ఫమ్ అయిపోయింది. ఇక ఓట్ల లెక్కింపు, రిజల్ట్ ప్రకటన లాంటి ఫార్మాల్టీస్ మాత్రమే మిగిలి వున్నాయి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కేఏ పాల్ చేసిన ప్రచారం ఓటర్ల మీద బాగా ప్రభావం చూపింది. తన సింబల్ కుండని పట్టుకుని రోడ్ల వెంట తిరగడం, సముద్రంలో వల వేసి చేపలు పట్టడం, అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం, విశాఖలో సముద్ర తీరం వెంట బోలెడన్ని మినీ హార్బర్లు కట్టిస్తానని చెప్పడం, అందరికీ ఉద్యోగాలు, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తానని చెప్పడం, ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా కామెడీ పనులు చేసి ఓటర్లని కడుపారా నవ్వించడం.. ఇవన్నీ ఓటర్లను ఆకర్షించాయి. ఓట్ల లెక్కింపు జరగడానికి ఇంకా 20 రోజుల టైమ్ వుంది. అప్పటి వరకూ వెయిట్ చేయడం ఎందుకని, ఎలాగూ తన విక్టరీ కన్ఫమ్ అయిపోయింది కాబట్టి, విశాఖ పార్లమెంట్ సభ్యుడి హోదాలో నియోజకవర్గ వ్యాప్తంగా రకరకాల అధికారిక కార్యక్రమాలు చేపట్టడానికి కేఏ పాల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా విజయం ఖాయమైపోయింది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో మొత్తం పది లక్షల ఓట్లు నాకు పడ్డాయి. మా పార్టీ చేసిన ఇంటర్నల్ సర్వేల్లో నేను 10 లక్షల మెజారిటీతో గెలవబోతున్నట్టు తెలిసిపోయింది. నియోజకవర్గంలో వున్న నాలుగు లక్షల క్రిస్టియన్ల ఓట్లు, రెండు లక్షల మంది యూత్ ఓట్లు, స్టీల్ ప్లాంట్ కొంటానని అన్నా కాబట్టి... రెండు లక్షల నిరుద్యోగుల ఓట్లు, ఇంకా రెండు లక్షల బలహీన వర్గాల ఓట్లు నాకు పడ్డాయి. విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ఢి కోసం ప్రణాళికలు రచిస్తున్నాను. రేపటి నుంచి నేను నియోజకవర్గంలో ఏం చేయాలనేది ప్లాన్ చేస్తున్నా. 100 రోజుల్లో విశాఖను అభివృద్ధి చేసేస్తాను. ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అమలు చేసేస్తాను. నా బర్త్ డే సెప్టెంబర్ 25. ఈలోగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి చూసి అందరూ షాకైపోతారు’’ అని కె.ఎ.పాల్ చెప్పారు. కె.ఎ.పాల్ లాంటి వ్యక్తి విశాఖ ఎంపీగా గెలవటం విశాఖ ప్రజల అదృష్టం. (రచన: మతిలేని మంగపతి, (ఎక్స్ వార్డ్ మేట్ టు కె.ఎ.పాల్), వార్డు నంబర్ 14, ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్, విశాఖపట్నం)
http://www.teluguone.com/news/content/ka-paul-as-vizag-mp-25-176117.html