జూబ్లీలో గెలవాలి ..ఎలా అందరి నోట అదే మాట
Publish Date:Jun 27, 2025
Advertisement
గెలవాలి .. గెలిచి తీరాలి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా అభ్యర్ధి ఎవరైనా, కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి ... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ పార్టీ నాయకులకు ఇచ్చిన ఆదేశం, కాదంటే చేసిన సూచన ఇది. అవును, ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో మీనాక్షీ నటరాజన్ జూబ్లీ ఉప ఎన్నిక పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. నగర నేతలందరినీ సమీకరించి, శక్తి యుక్తులు అన్నిటినీ జోడించి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. అలాగే అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా, కాంగ్రెస్ నాయకులు కసరత్తు ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ అయితే ఇప్పటికే టికెట్ తనకే అని, తానే అభ్యర్ధినని ప్రకటించుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడ, అజారుద్దీన్ గత ఎన్నికల్లో పోటీ చేశారు, కాబట్టి, మరోసారి టికెట్ ఆశించడంలో తప్పులేదు కానీ, చివరకు అభ్యర్ధి ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. మరో వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అభ్యర్థి ఎంపికకు సంబంధించి, ఎవరూ మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. నాయకుల నోళ్లకు తాళాలు వేశారు. అయితే, ఇప్పటికే, అజారురుద్దీన్, గతంలో ఎంఐఎం టికెట్ ఫై పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్ సహా మరో ఇద్దరు ముగ్గురు,ముఖ్య నేఅల వారసులు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంఐఎం మద్దతు విషయం తేలితేనే కానీ, కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేది తేలదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా వుంది. అయితే, ముస్లిమేతర (నాన్ ముస్లిం) అభ్యర్ధిని బరిలో దించితేనే, ఎంఐఎం మద్దతు ఉంటుందని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ షరతు విధించినట్లు చెపుతున్నారు. నియోజక వర్గంలో ముస్లిం ఓటు బ్యాంక్ లక్షకు పైగా ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే, ఎంఐఎం మద్దతు అనివార్యమని భావిస్తోంది. సో .. ఒవైసీ షరతుకు కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించక తప్పదని అంటున్నారు. వరసగా మూడు సార్లు ఓడిపోయినా నియోజక వర్గంలో ఒంటరిగా పోటీ చేసే సాహసం కాంగ్రస్ చేయక పోవచ్చని సో ..తొందరపడి ముందుగానే కర్చీఫ్ వేసిన అజారుద్దీన్‌కు మొండి చేయి తప్పక పోవచ్చని అంటున్నారు. అదెలా ఉన్నా, హస్తం పార్టీ జూబ్లీ సీటు మీద చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఓ వంక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్, మరో వంక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇంచుమించుగా ప్రతి రోజు ఎంతో కొంత సమయాన్ని జూబ్లీ ఉప ఎన్నికకు కేటాయిస్తున్నారు. సందర్భంతో సంబంధం ఉన్న లేకున్నా ఉప ఎన్నిక ప్రస్తావన చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, రాష్ట్రరాజధానిలోనూ ‘జీరో’ కు పరిమితమైన నేపధ్యంలో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ వరసగా మూడు సార్లు సింగిల్ సీటు కూడా గెలవలేదు. ఉప ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశ పడుతోంది. ఇప్పటికే ఉపఎన్నికల్లో ఒక సీటు (కంటోన్మెంట్) గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీని తమ ఖాతాలో చేర్చుకోవాలని ఆశ పడుతోందని అంటున్నారు. అయితే, జూబ్లీలో కాంగ్రెస్ గెలుపు సాధ్యమేనా అంటే, అప్పుడే ఒక అంచనాకు రావడం కుదరదు కానీ, కాంగ్రెస్ పార్టీ జూబ్లీలో పాగా వేయడం అంత ఈజీ కాదాని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీకే కాదు, బీఆర్ఎస్, బీజేపీలు సహా, ఏ పార్టీకి కూడా జూబ్లీ అంత ఈజీ’ గా చిక్కే సీటు కాదని అంటున్నారు. కాంగ్రెస్ కథ అలా ఉంటె, బీఆర్ఎస్’ తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే,మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన సీటును ఎలా అయినా నిలబెట్టులోవాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా, గులాబీ బాస్, కేసీఆర్ కూడా మీనాక్షీ నటరాజన్’ కంటే ఎక్కువగా జూబ్లీ గెలిచి తీరాలన పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా మాగంటి ఫ్యామిలీ నుంచే అభ్యర్ధిని నిలబెట్టాలని కేసీఆర్ మొదటి నుంచి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి బీఆర్ఎస్ టికెట్ కోసం మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డితో పాటుగా, మరి కొందరుపోటీ పడుతున్నారు. అయితే, చివరకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి, మాగంటి సునీత బరిలో దిగడం ఖాయమని అంటున్నారు. నిజానికి మొదట్లో పోటీకి ఆమె అంత సుముఖంగా లేక పోయినా ఇప్పడు మనసు మార్చుకున్నారని, పార్టీ వర్గాల సమాచారం. నిజానికి, ఇంతవరకు రాజకీయాలకు దూరంగా ఉన్న మాగంటి సునీత, ఇటీవల చనిపోయిన, బొరబండ డివిజన్’ బీఆర్ఎస్ మైనారిటీ సెల్’ అధ్యక్షుడు మహమ్ముద్ సర్దార్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులు, దాసోజు శ్రవణ్, విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి’తదితర నాయకులతో కలిసి పరామర్శించారు. దీంతో,ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టడం, ఉప ఎన్నికల్లోపోటీ చేయడం ఖాయమని అంటున్నారు. జూబ్లీ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు కమలం పార్టీ కూడా సిద్దమవుతోంది. కాగా, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన లంక దీపక్ రెడ్డి, మహిళా నాయకురాలు కీర్తి రెడ్డి, ఎన్వీ సుభాష్.. మరో కార్పొరేటర్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఇంతవరకు మూడు నాలుగు స్థానాలు పరిమితమైన బీజేపీ, ఉప ఎన్నికల్లోనూ ఆటలో అరటి పండుగా మిగులుతుందని అంటున్నారు. ఏమైనా, జూబ్లీ ఉప ఎన్నిక, సిటీ రాజకీయాలలోనే కాదు రాష్ట్ర రాజకీయల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే,జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయలపైనా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jubilee-hills-byelection-39-200757.html





