ఆ హీరో... 'అమ్మ' రాజకీయ వారసుడట!
Publish Date:Oct 8, 2016
Advertisement
నవరాత్రుల వేళ దేశం అంతా పండగ చేసుకుంటోంది. కాని, తమిళనాడులో మాత్రం పండగ బాగానే జరుగుతోన్నా జనంలో ఏదో విషాదం! అందుక్కారణం తమిళుల అమ్మ ఆసుపత్రిపాలవటమే! ఒక దశలో ఆమె గురించిన దుర్వార్త వినాల్సి వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. కాని, క్రమంగా ఒక్కొక్కరూ జయలలిత కోలుకుంటోందని చెబుతుంటే సామాన్య జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. కాని, అదే సమయంలో అమ్మ అనారోగ్యం అక్కడి అధికార వ్యవస్థని మొత్తం మంచం పట్టేలా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే జయ అపోలో ఆసుపత్రిలో చేరిన నాటి నుంచీ తమిళానాడు కూడా స్థంభించి పోయింది...
కరుణానిధితో ఎన్నికల్లో పోరాడి గెలిచిన జయలలిత ఇప్పుడు విధితో పోరాడుతోంది. మళ్లీ ఆరోగ్యంగా సీఎం కూర్చిలో కూర్చునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అదే సమయంలో ఆమె వారసత్వం కూడా ఇప్పుడు పెద్ద డిస్కషన్ అయిపోయింది. పెళ్లి, పిల్లలు లేని జయలలిత తన తరువాత తమిళనాడుకు ఎవరు అన్నది ఎప్పుడూ పబ్లిగ్గా చెప్పలేదు. కాని, ఆమె రాజకీయ వారసత్వం కొనసాగించటానికి చాలా మందే రెడీ అవుతున్నారు.
అన్నాడీఎంకే పార్టీలో అమ్మకు నమ్మకస్థులైన నేతలు చాలా మందే వున్నారు. వాళ్లలో జయ జైల్లో వున్నప్పుడు సీఎం అయిన పన్నీర్ సెల్వం కూడా ఒకరు. ఆయన కాక మరో మంత్రి పళని స్వామి కూడా రేస్ లో వున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉప ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపడతారని టాక్. కాని, జయలలిత ఆరోగ్యం తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న నేపథ్యంలో ఆమె శాశ్వత వారసులుగా ఎవరో ఒకరు ముందుకు రావాలన్నది చర్చగా మారింది! ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రెండు పేర్లు చెన్నైలో చక్కర్లు కొడుతున్నాయి...
జయలలితకు జయకుమార్ అనే ఓ అన్నయ్య వున్నాడు. కొన్నేళ్ల కిందట చనిపోయాడు. ఆయన కూతురే దీపా జయకుమార్. ఈమె తానే జయకు వారసురాల్ని అంటోంది. కాని, జయలలితకు, దీపా జయకుమార్ కుటుంబానికి ఎప్పట్నుంచో రిలేషన్స్ లేవు. వాళ్లతో పడక తమిళనాడు సీఎం దూరం పెట్టింది. కాని, ఇప్పుడు ఆరోగ్యం బాగా లేని సమయంలో మేన కోడలు దీపా జయకుమార్ తనని అత్త వద్దకి పంపాలని డిమాండ్ చేస్తోంది. అన్నాడీఎంకే నేతలు మాత్రం ఒప్పుకోవటం లేదు. మరి అత్తని చూడటానికే పర్మిషన్ దొరకని దీపా ఆమె వారసత్వాన్ని ఎలా దక్కించుకుంటుంది? ఇది మిలియన్ డాలర్ ప్రశ్నే!
జయలలిత వారసుడంటూ వినిపిస్తోన్న రెండో పేరు అందరూ ఆశ్చర్యపోయేదే! ఇప్పటి వరకూ రాజకీయాల జోలికి అస్సలు పోని హీరో అజిత్... జయ వారసుడంటున్నారు! దీనికి కారణం గతంలో చాలా సార్లు ఆమె అజిత్ ను తన వారసుడని దగ్గరి వారితో చెప్పిందట. అలాగే అజిత్ కూడా ఏనాడూ తనకు అమ్మ పై వున్న ప్రేమ దాచుకోలేదు. పబ్లిగ్గా పురుచితలైవికి మద్దతు తెలిపేవాడు. ఆమెతో దగ్గరి అనుబంధం వుంది...
అజిత్ తమిళనాడు సీఎం అవ్వటం... మామూలుగా అయితే నమ్మదగ్గది కాదు! కాని, చైన్నై పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే! చూడాలి మరి జయ వారసత్వం విజయవంతంగా అందుకునేది ఎవరో?
http://www.teluguone.com/news/content/jayalalita--45-67576.html





