జన్వాడ కేసులో సంచలన ట్విస్ట్.. బంగారు నిధి పేరుతో మోసం
Publish Date:Jun 30, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకున్న సాయి–పద్మ దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఐదు నెలల క్రితమే ఓ బాబు జన్మించాడు. ఆనందంగా సాగాల్సిన వారి దాంపత్య జీవితం చివరకు విషాదాంతమైంది. ఈ కేసులో పద్మ తల్లిదండ్రులు, మేనమరిదిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పద్మ తండ్రి చంద్రయ్య తన ఇంట్లో బంగారు నిధి ఉందని కూతురు, అల్లుడు సాయిని నమ్మించాడు. ఆ నిధిని వెలికితీయడానికి రూ.10 లక్షలు అవసరమని చెప్పడంతో సాయి ఆ మొత్తాన్ని ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అయితే తవ్వకాలు నిర్వహించినప్పటికీ ఎలాంటి నిధి లభించలేదు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని సాయి పలుమార్లు కోరినా, చంద్రయ్య వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటూ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర మానసిక ఒత్తిడి ఒకవైపు.. కన్న తల్లిదండ్రులే నమ్మించి మోసం చేశారన్న బాధ మరోవైపు వెంటాడడంతో సాయి–పద్మ దంపతులు తీవ్ర నిరాశకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. చివరకు తమ ఐదు నెలల పసిబిడ్డను అనాథగా చేసి, వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పద్మ తండ్రి చంద్రయ్యతో పాటు, తల్లి శాంతమ్మ, మేనమరిది వెంకటేష్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోయిన ఐదు నెలల చిన్నారి పరిస్థితి స్థానికులను కలచివేస్తోంది. ఈ కేసులో మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/janwada-couple-suicide-36-224646.html





