ఎవరికి వారే యమునా తీరే.. జనగామ కాంగ్రెస్ నేతల తీరే వేరయా
Publish Date:Jun 20, 2022
Advertisement
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యధిక రాజకీయ అనుభవం ఉన్న పార్టీ. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఈ రాజకీయ పార్టీని అభివర్ణిస్తుంటారు. సుదీర్ఘ కాలం పాటు దేశంలో తిరుగులేని అధికారం చెలాయించిన ఈ పార్టీ ఇటీవలి కాలంలో బాగా బలహీనపడింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండంటే రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ కు కర్ణుడికి సహజ కవచ కుండలాల్లా.. పార్టీలో వర్గపోరు, అంతర్గత విభేదాలు ఎల్లవేళలా అంటిపెట్టుకునే ఉంటాయి. పార్టీకి విజయావకాశాలున్న చోట కూడా పార్టీలోని విభేదాలు ఆ అవకాశాలకు గండికొట్టే పరిస్థితులు ఎదురౌతున్నా నేతలకు పెద్ద పట్టింపు ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంగా ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దీటైన పోటీ ఇవ్వగలిగే పరిస్థితి ఉందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు క్యాడర్ లో కలవరం సృష్టిస్తున్నాయి. అయోమయానికి కారణమౌతున్నాయి. ఈ పరిస్థితి పలు నియోజకవర్గాలలో నెలకొని ఉంది. అయితే జనగామ జిల్లాలో మాత్రం ఈ వర్గ పోరు ఒకింత తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిలు ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తుండటం.. వేర్వేరు కుంపట్లు రాజేసుకుని పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే వేర్వురుగా నిర్వహిస్తుండటంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఇటీవల వరంగల్ లో జరిగిన రాహుల్ సభ అద్బుత విజయం సాధించడం, ఆ సభలో వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను ప్రతి నియోజకవర్గంలోని గడపగడపచూ చేర్చడంలో కాంగ్రెస్ నాయకులు ఒక నిర్దుష్ట పథకంతో ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో మున్నెన్నడూ కనిపించని ఐక్యతా కనిపిస్తోందని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణపేరుతో వేధిస్తున్నదంటూ.. దేశ వ్యాప్ంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపు నిచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన పరిశీలకులు సైతం వ్యక్తం చేశారు. అయితే జనగామ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఏమీ మారలేదు. ఇక్కడ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్యా సయోధ్య అన్నది ఎండమావిలాగే తయారైంది. ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో టికెట్ రేసులో ఉన్నవారే. దీంతో ఇద్దరూ కూడా వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ హామీలను జనంలోకి తీసుకెళ్లే కార్యక్ర మంలో కూడా ఎవరి దారి వారిదేగా ఉంది. ఎవరికి వారు నియోజకవర్గ గ్రామాలలో పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఎవరి క్యాడర్ వారిదే అన్నట్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయిన పరిస్థతి. కోమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడవటూరు సిద్దేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి రచ్చబండ ప్రారంభిస్తే, పొన్నాల లక్ష్మయ్య కొమురవెల్లి మల్లిఖార్జున దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి రచ్చబండ చేపట్టారు. రచ్చబండ కార్యక్రమాన్ని సైతం జనగామ నియోజకవర్గంలోని చేర్యాల,కొమురవెల్లి,మద్దూరు మండలాల్లో ఇరువురు నాయకులు వేరువేరుగా నిర్వహించడంతో పార్టీలో అయోమయం నెలకొంది. ప్రజలు సైతం ఇరువురునేతలూ కాంగ్రెస్ లోనే ఉన్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ గందరగోళపడుతున్నారు. ఈ పరిస్థితిని పార్టీ నాయకత్వంఎలా సరిదిద్దుతుందా అని పార్టీ క్యాడర్ ఎదురు చూస్తోంది.
http://www.teluguone.com/news/content/janagaoncongress-split-into-two-between-two-seniour-leaders-25-138016.html





