పాలకొల్లు అమ్మాయి.. అంతరిక్షయానం
Publish Date:Jun 24, 2025
Advertisement
మన పాలకొల్లు అమ్మాయి ఏకంగా అంతరిక్షయానం చేయనుంది. ఇప్పటి వరకూ భారత్ లో పుట్టి ఇక్కడే నివసిస్తున్న మహిళ అంతరిక్షయానానికి ఎంపికైన చరిత్ర లేదు. అయితే అంతరిక్షయానానికి ఎంపికై మన పాలకొల్లు అమ్మాయి జాహ్నవి చరిత్ర సృష్టించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షల్లో జాహ్నవి దంగేటి ఉత్తీర్ణురాలై ఈ స్పేస్ మిషన్ కి అర్హత సాధించింది. ఈ మేరకు జాహ్నవి కి టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నుంచి వర్తమానం అందింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్ లో అంతరిక్ష ప్రయోగ ,వాణిజ్య ,పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ కేంద్రం నిర్మాణంలో మొదటిగా కొద్ది మంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులతో ప్రయోగాన్ని చేపట్టనున్నారు. 2029 మార్చి నెలలో నిర్వహించబోయే టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ మొదటి అంతరిక్ష ప్రారంభ యాత్ర బృందంలో భారతదేశం నుంచి జాహ్నవి దంగేటి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ యాత్రలో భాగంగా జాహ్నవి ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది. ఇప్పటికే మూడుసార్లు అంతరిక్ష యాత్రలు పూర్తిచేసిన అమెరికాకుచెందిన సీనియర్ వ్యోమగామి బిల్ మేక్ ఆర్థర్ నేతృత్వంలో టైటాన్స్ స్పేస్ మిషన్ తొలి అంతరిక్ష యానం చేయనుంది.ఇందుకు సంబందించిన వ్యోమగామి అభ్యర్థుల కు వచ్చేఏడాది అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ఇంత వరకు భారత సంతతికి చెందిన అమెరికన్లు సునీతా విలియమ్స్ ,కల్పనా చావ్లా వ్యోమగాములుగా అంతరిక్షంలో అడుగిడారు. అయితే జాహ్నవి దంగేటి మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించింది. చిన్నతనంనుంచే చంద్రుడిపై అడుగుపెట్టాలని ధృఢనిశ్చయంతో ఆ దిశగా తన లక్ష్యాన్ని మలుచుకుంది.ఇంటర్మీడియట్ వరకు పాలకొల్లులోనే విద్యాభ్యాసం చేసిన జాహ్నవి ఇంజనీరింగ్ మాత్రం పంజాబ్ లో పూర్తిచేసింది. 2021 లో అమెరికా లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం కి భారతదేశం నుంచి ఎంపికై రికార్దు సృష్టించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాల్లో జరుగుతున్న వ్యోమగామి శిబిరాల్లో శిక్షణ పొందుతూ వస్తోంది. పోలెండ్ లో అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించిన జాహ్నవిఐస్ లాండ్ దేశంలో జియో స్పేస్ సెంటర్లో శిక్షణ తీసుకున్న మొదటి భారతీయురాలిగా నిలిచింది. ఇక్కడే 1965 , 1967 సంవత్సరాల్లో అమెరికా అపోలో ఆస్ట్రోనాట్ లు శిక్షణ పొందారు. చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం కూడా జియో స్పేస్ సెంటర్ లోనే శిక్షణ పొందటం జాహ్నవికి మరింత స్ఫూర్తి కలిగించింది.
http://www.teluguone.com/news/content/jahnavi-dangeeti-palakollu-girl-astronaut-25-200553.html





