వస్తే పులితోనే!.. ఉక్రెయిన్‌లో తెలు'గోడు'..
Publish Date:Mar 5, 2022
Advertisement
అతని పేరు కుమార్. అలియాస్ జాగ్వార్ కుమార్. సోషల్ మీడియాలో పాపులర్. అందుకు కారణం అతను పెంచుకుంటున్న చిరుతపులి. అవును, అందరిలా కుక్కను కాకుండా చిరుతను పెంచుకుంటున్నాడు కుమార్. అతని స్వస్థలం తణుకు అయినా.. ప్రస్తుతం ఉంటున్నది మాత్రం ఉక్రెయిన్‌లో. అక్కడ డాక్టర్‌గా చేస్తున్నాడు. ప్రస్తుత యుద్ధ సమయంలో అంతా బాంబు దాడులతో హడలిపోతుంటే.. కుమార్ మాత్రం అదరక బెదరక పులితో సావాసం చేస్తూ అక్కడే ఉంటానంటున్నాడు. కుమార్‌కు చిరుతపులి అంటే ఇష్టం ఏర్పడటానికి కారణం చిరంజీవినే. అవును, హీరో చిరునే. ఎలాగంటే.. కుమార్ చిన్నప్పుడు తన అభిమాన నటుడు చిరంజీవి నటించిన లంకేశ్వరుడు చూశాడు. ఆ మూవీలో చిరు దగ్గర.. ఓ చిరుత పులి ఉంటుంది. ఆ సీన్‌కి మనోడు బాగా కనెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి పులిపై ఆసక్తి పెంచుకున్నాడు. ఉక్రెయిన్ వెళ్లాక తన కోరిక తీర్చుకున్నాడు. చిరుత పులిని పెంచుకుంటున్నాడు. అందుకు, ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నాడు కుమార్. అయితే, ప్రస్తుతం రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగగా.. బాంబులతో హోరెత్తిస్తుండగా.. ఉక్రెయిన్ వాసులు, విదేశీయులు ప్రాణభయంతో దేశ సరిహద్దులు దాటి పోతున్నారు. ఎప్పుడు, ఎటునుంచి బాంబు వచ్చి మీద పడుతుందోననే టెన్షన్‌తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస కడుతున్నారు. కానీ, కుమార్ మాత్రం వారితో వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే పెంపుడు పులిని వదిలేసి పోలేనంటున్నాడు. చిరుతతోనే వెళ్దామంటే.. కుదరదు. మిగతా వారు హడలి చస్తారు. అలాగని ప్రేమతో పెంచుకుంటున్న జాగ్వార్‌ను ఒంటరిగా అక్కడే వదిలేయలేకపోతున్నాడు. అందుకే, చావో బతుకో.. తన చిరుతతోనే అంటూ ఉక్రెయిన్‌లోనే ఉండిపోయాడు. ఒకవేళ ప్రాణాల మీదకు వస్తే.. చిరుతతోనే బయటకు వస్తానంటున్నాడు. అదీ పులిపై ప్రేమంటే.
http://www.teluguone.com/news/content/jaguar-kumar-story-in-ukraine-25-132644.html





