సుహాసిని పోటీ..జగపతి బాబు మద్దతు..పురంధేశ్వరి కామెంట్స్
Publish Date:Nov 22, 2018
Advertisement
కూకట్ పల్లి స్థానం నుంచి టీడీపీ తరుపున హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి, నారా కుటుంబాలు తమ మద్దతు తెలిపాయి. బాలకృష్ణ దగ్గర ఉండి మరీ నామినేషన్ వేయించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా తమ సోదరిని గెలిపించమని కోరుతూ ప్రకటన విడుదల చేశారు. తాజాగా నటుడు జగపతిబాబు సుహాసినికి తన మద్దతు తెలిపారు. సుహాసిని ఎంతో నిజాయతీ కలిగిన వ్యక్తి అని, ప్రజలకు నిబద్ధతతో సేవ చేయగలదని తాను నమ్ముతున్నానని జగపతిబాబు పేర్కొన్నారు. కూకట్‌పల్లి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆమెను ఆ నియోజకవర్గ ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. జగపతి బాబు కూడా ఇటీవల చంద్రబాబు ని కలవటంతో పార్టీలో చేరుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆయన ఖండించకపోవటం, ఇప్పుడు సుహాసినికి మద్దతు ఇవ్వటం చూస్తే ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుహాసిని మేనత్త, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా మేనకోడలు పోటీపై స్పందించారు. తాజాగా ఆమె ఎన్నికల ప్రచార నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసినికి మీ సహకారం ఉంటుందా అని అడగ్గా.. ఓ మేనత్తగా కోడలికి ఎప్పుడూ తన ఆశీర్వాదం ఉంటుందన్నారు. పార్టీ పరంగా తాము వ్యతిరేకమైనా మేనకోడలిగా ఆమెకు తన దీవెనలు ఉంటాయని పురందేశ్వరి నవ్వూతూ బదులిచ్చారు. మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భావసారూప్యత, సిద్ధాంతాలంటూ లేని మహాకూటమిని, అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించేందుకు, నరేంద్రమోదీని గద్దె దింపేందుకు మాత్రమే మహాకూటమి ఏర్పడిందన్నారు. అయితే.. మోదీని ఎందుకు గద్దె దింపాలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంతకాలం కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ లకు అవకాశం ఇచ్చిన మల్కాజిగిరి ప్రజలు ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి రాంచందర్‌రావు తెలిపారు.
http://www.teluguone.com/news/content/jagapati-babu-supports-nandamuri-suhasini-39-84498.html





