పొలిటికల్ పుష్పగా ట్రోల్ అవుతున్న జగన్
Publish Date:Jun 19, 2025

Advertisement
రప్పా రప్పా డైలాగ్‌తో మాజీ ముఖ్యమంత్రి జగన్ సోషల్‌మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పుష్ష సినిమాలో డైలాగ్ చెప్పి, దాన్ని మీడియా సమావేశంలో మళ్లీ మళ్లీ చెప్పించుకుని మురిసిపోయిన వైసీపీ అధ్యక్షుడ్ని పొలిటికల్ పుష్ప అని నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. అంతు చూస్తాం.. రప్పా రప్పా నరుకుతాం అంటూ పల్నాడులో భీతావహ వాతావరణానికి కారణమైన తమ పార్టీ కార్యకర్తల్ని మందలించాల్సింది పోయి వారిని వెనకేసు కొచ్చా రాయన. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. పైగా దానికో కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. పుష్ప సినిమాలో డైలాగ్ కొట్టడం కూడా తప్పేనా? అంటూ మీడియా సమావేశంలో సమర్థించుకొచ్చారు.
జగన్ పల్నాడు పర్యటనలో గంగమ్మతల్లి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరికేస్తాం అని పోస్టర్ పెట్టారు. అది పుష్ప సినిమా డైలాగ్ అని దాన్ని అది పోస్టర్‌లో పెట్టినా తప్పేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? పుష్పలో ఫొటోలు పెట్టినా, గడ్డం చేతితో రుద్దుకున్నా తప్పేనా? అని జగన్ దాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అదేమంటే ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందని.. టీడీపీ సానుభూతిపరుడు కూడా చంద్రబాబుపై కోపంతో మారాడని సంతోషం పడదామని విచిత్రమైన లాజిక్ వినిపించారు. టీడీపీను రప్పా.. రప్పా కోసేస్తా అని అంటున్నాడని ఆనందపడదామని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. వాస్తవానికి సదరు వైసీపీ కార్యకర్త రూ.5 లక్షల భీమా పథకం కోసమే టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంట. ఎన్నికల ముందు తన తండ్రి టీడీపీలో చేరుతుంటే తీవ్రంగా వ్యతిరేకించాడంట.
మొత్తానికి జగన్ తన వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు గట్టిగానే టార్గెట్ అవుతున్నారు. ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇంకా పాఠం నేర్చుకోలేదని, ఎందుకు ఓడిపోయామనే పరిశీలన కూడా చేసుకోలేదని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. జగన్ పల్నాడు పర్యటనపై మీడియాతో మాట్లాడిన మంత్రి నక్సలైట్లను చూసి కలబడి నిలబడిన నాయకుడు చంద్రబాబు అని, జగన్ రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి గతంలో అరాచకం చేశారని..అందుకే గతంలో జరిగిన అరాచకాలను ప్రజలు రప్పా రప్పా అని నరికారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వంపై కాదు.. ప్రజలపైనే వైసీపీ తిరుగుబాటు. రప్పా రప్పా అని ఎవరిని నరుకుతారు? ప్రజలనా? ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శా? పరామర్శ పర్యటనలో ఇద్దరు చనిపోతే పరామర్శించలేదే. సొంత బాబాయి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని పయ్యావుల ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/jagan-trolled-as-political-pushpa-39-200319.html












