డిక్లరేషన్ ఇస్తేనే జగన్ కు దర్శనానికి అనుమతి.. టీటీడీ నిర్ణయం
Publish Date:Sep 27, 2024
Advertisement
జగన్ తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అనుమానమే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనను దర్శనానికి అనుమతించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అన్యమతస్థుడు కనుక ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తప్పని సరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అంటున్నది. ఈ నేపథ్యంలోనే శనివారం (సెప్టెంబర్ 28) ఆయన దర్శనానికి ముందుగానే తిరుమలలో ఆయన బస చేసిన గెస్ట్ హౌస్ కు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ పత్రం ఇచ్చి సంతకం తీసుకోవాలని నిర్ణయించింది. ఆయన డిక్లరేషన్ పై సంతకం పెడితే ఓకే.. ఒక వేళ సంతకం పెట్టడానికి నిరాకరిస్తే మాత్రం దర్శనానికి అనుమతించరాదని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ ఇంకా రాలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. జగన్ తిరుమల పర్యటన వేళ ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇది ఒకటే మార్గంగా తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. గతంలో జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వలేదనీ, అయితే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చినందున నిబంధనల మేరకు డిక్లరేషన్ పై పట్టుబట్టలేదనీ టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. కాగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే జగన్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఆందోళనలకూ పాల్పడవద్దంటూ జనసేని శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ డిక్లరేషన్ వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటుందనీ, డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ కు అనుమతి ఇవ్వాలా, అనుమతి నిరాకరించాలా అన్నది టీటీడీకి సంబంధించిన అంశమనీ పవన్ కల్యాణ్ పేర్కొన్న నేపథ్యంలో ఆందోళనలు, నిరసనలకు దూరంగా ఉండాలని ఇప్పటికే జనసేన శ్రేణులు ఫిక్స్ అయిపోయారు. అయితే బీజేపీ, హిందూ సంస్థలూ మాత్రం జగన్ తిరుమల పర్యటన, డిక్లరేషన్ అంశంపై గట్టిగా నిలబడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల దేవుడిని దర్శించుకోవడానికి ఎంత మాత్రం అంగీకరించమనీ, అవసరమనుకుంటే అలిపిరి వద్దనే ఆయనను అడ్డుకుంటామనీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ 30ని పోలీసులు అమలులోకి తీసుకు వచ్చారు. ఇలా ఉండగా మందీ మార్బలంతో జగన్ జగన్ తిరుమల పర్యటనకు బయలుదేరనుండటం పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వేల మందితో ఆయన తిరుమల రావడం దేవుడి దర్శనానికా, దండయాత్రకా అంటే తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-tirumala-darshan-only-after-declaration-25-185709.html





