జగన్ హయాంలో ఏమున్నది గర్వకారణం.. మూడేళ్ల చరిత్ర సమస్తం వేధింపులు, విధ్వంసం, బెదిరింపులు
Publish Date:Jun 20, 2022
Advertisement
ఏపీలో జగన్ పాలన అంతా అంతా విపక్ష నేతల్ని వేధించడం, బెదిరించడం, వారి అస్తులను ధ్వంసం చేయడంగా కొనసాగిపోతోంది. జగన్ అధికారం వచ్చిందే తడవు ప్రజావేదికను కూలగొట్టడంతో మొదలైన విధ్వంస పాలన తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు, బీసీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహారీగోడను కూల్చే దాకా అప్రతిహతంగా సాగిపోతోంది. జగన్ ప్రభుత్వంపై, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై ఏ విపక్ష నేత నోరెత్తి విమర్శివంచినా వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువల నీరు తాగించడమే ఏకైక లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో టీడీపీ శాసనసభాపక్షఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడ్ని శ్రీకాకుళంలో అరెస్టు చేసి, అక్కడి నుంచి ఊళ్లన్నీ తిప్పి విజయవాడ తీసకువచ్చి ఇబ్బంది పెట్టిన వైనం గుర్తుండే ఉంటుంది. శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న అచ్చెన్నను అంత దూరం, గంటల పాటు కారులోనే తిప్పడంతో ఆయన తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా హత్యా నేరం, కుట్ర నెపంతో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో వేసేదాకా వైసీపీ పెద్దల మనసు శాంతించలేదు. అలాగే విశాఖ లోక్ సభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీభరత్ కు చెందిన గీతం యూనివర్శిటీపై వైసీపీ పెద్దల కన్నుపడింది. గీతం వర్శిటీలో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా వర్శిటీ ప్రధాన ద్వారం కూల్చివేయించింది. దాంతో పాటు గీతం వర్శిటీలో కొన్ని ఎకరాల భూమిని మార్కింగ్ చేసి, అందులో నిర్మాణాలేవీ చేయకూడదని ఆదేశించింది. ఇక వైసీపీ సర్కార్ తప్పిదాలను ఎప్పటికప్పుడు వేలెత్తి చూపిస్తున్నారనే అక్కసుతో మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖపట్నంలోని సీతమ్మధారలో నిర్మించుకున్న భవనంలోని వాచ్ మన్ బాత్ రూమ్ ను కూలగొట్టింది. జీవీఎంసీ పార్కుకు చెందిన ఆరు అడుగుల వెడల్పు మేర స్థలం సబ్బం హరి భవనం ఆవరణలో కలిసిపోయిందనే సాకును జగన్ సర్కార్ చూపించింది. విశాఖ సిరిపురంలో వీఎంఆర్ డీఏ స్థలాన్ని లీజుకు తీసుకుని టీడీపీ నేత హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ హొటల్ ను దీపావళి రోజున బలవంతంగా ఖాళీ చేయించడమే కాకుండా హొటల్ లోని వంట పాత్రలతో సహా ఫర్నీచర్ ను లారీల్లో ఎక్కించి తాళాలు వేయించింది. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ పదవి ఆశచూపి ఆహ్వానించినా వైసీపీలోకి రాలేదనే కక్షతో గాజువాకలో ఆయన నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని జీవీఎంసీ సిబ్బందితో కూలగొట్టించింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం, అధిష్టానం, ఆ పార్టీ నేతలు చేస్తున్న దురాగతాలపై ఒంటికాలిపై లేచి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహారీ గోడను కూలగొట్టించడం రాజకీయంగా దుమారం లేపింది. నర్సీపట్నం మున్సిపాల్టీలోని శివపురంలో అయ్యన్న పాత్రుడు రెండు సెంట్ల భూమిని ఆక్రమించారంటూ ఆదివారం తెల్లవారు జామున కూలగొట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేసి, మానసికంగా కుంగదీయడమే లక్ష్యంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు సర్వత్రా విన వస్తున్నాయి. విపక్ష నేతలను వేధించేందుకు రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలను పావులుగా వాడుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఎవరి నిర్మాణాలను కూల్చివేయాలనే కుట్రను శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము లోపే అమలు చేస్తుండడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/jagan-three-years-rule-is-threatning-25-138051.html





