జనం విశ్వాసాన్ని మరింత కోల్పోయే దిశగా జగన్ అడుగులు
Publish Date:Jul 29, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల అరాచకపాలనతో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్నే విస్పష్టంగా తేల్చేశాయి. అయితే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో హింస తాండవిస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు. హస్తిన వరకూ వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చారు. అయితే తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి నిండా 50 రోజులు కూడా కాలేదు. అప్పుడే జగన్ విమర్శలకు ఉపక్రమించడమేంటని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. హామీల అమలులో చంద్రబాబు చేతులెత్తేశారంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. తల్లికి వందనంపై జగన్ అండ్ కో చేస్తున్న వ్యాఖ్యలను జనం విశ్వసించడం లేదు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నదని, వైసీపీ కార్యకర్తలపై దాడులు,హత్యా కాండ జరుగుతున్నదన్న జగన్ ఆరోపణలపై లెక్కలు చెప్పాలని అధికార పార్టీయే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా అడుగుతున్నారు. జగన్ హస్తిన వేదికగా చేసిన ఆధ్నాలో ఇదే ప్రశ్న జాతీయ మీడియా నుంచి కూడా ఎదురైంది. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో 36మంది వైసీపీ కార్యకర్తలను చంపేశారంటూ జగన్ చేసిన ఆరోపణపై ఆధారాలు, వివరాలు చెప్పాలంటూ జాతీయ స్థాయి మీడియా ప్రశ్నిస్తే.. టాపిక్ డైవర్ట్ చేయవద్దు.. లంచ్ టైం అయ్యింది, భోజనం చేయండంటూ మాట దాటేశారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సైతం.. హతుల వివరాలు ఇవ్వండి, నిందితులపై చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే డిమాండ్ చేశారు. అయితే జగన్ మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. దీంతో జగన్ మాటలకు, ఆరోపణలకు, విమర్శలకు విశ్వసనీయత లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన హయాంలో అప్పుల గురించి చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించిన జగన్.. అయితే అవి అబద్ధాలన్న తన ఆరోపణకు మాత్రం ఆధారాలు చూపమంటే మాట దాటేస్తున్నారు. లేదా నీళ్లు నములుతున్నారు. జగన్ ఈ తీరుతోనే సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతల హాజరును గొప్పగా చెప్పుకుంటున్న జగన్.. వారు ఆ ధర్నాలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయకపోవడం, వారి ప్రసంగాలన్నీ జనరల్ గా హింసా రాజకీయాలను ఖండించడానికే పరిమితం కావడంపై ప్రశ్నలకు మాత్రం జగన్ సమాధానం చెప్పడం లేదు. జగన్ తాపత్రయమంతా.. ఎలాగోలా కాంగ్రెస్ కూటమికి దగ్గరై తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం అయితే పొలిటికల్ ప్రొటక్షన్ సంపాదించుకోవడం కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత హడావుడి చేస్తున్న జగన్ తన హస్తిన ధర్నాకు కాంగ్రెస్ గైర్హాజర్ కావడాన్ని ప్రస్తావించడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షు రాలు, సొంత చెల్లెలు షర్మిల చేస్తున్న విమర్శలపై కూడా నోరు మెదపడంలేదు. ఆ విషయంపై మీడియా నుంచి ఎదురౌతున్న ప్రశ్నలతో అసహనానికి గురౌైతున్నారు. అన్నిటికీ మించి అకారణంగా అసెంబ్లీకి గైర్హాజరై.. ప్రభుత్వ తీరును అసెంబ్లీ బయట తప్పుపడుతూ చేస్తున్న హంగామా వల్ల జగన్ కు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో బీజేపీ ప్రభ నెమ్మది నెమ్మదిగా మసకబారుతున్న సూచనలు కనిపిస్తుండటం, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తుండటంతో.. జగన్ తన విధేయతను కాంగ్రెస్ వైపు మళ్లించి, ఆ పార్టీ అండకోసం నేల విడిచి సాము చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిజంగానే కాంగ్రెస్ దేశంలో బలపడి, బీజేపీ బలహీన పడినా జగన్ కు రాజకీయంగా నష్టం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అయితే.. ఆ మేరకు నష్టపోయేది వైసీపీ మాత్రమే. అదెలా అంటే.. వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుంచి వచ్చినదే. అలాగే వైసీపీలో నేతలూ, క్యాడర్ దాదాపు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వారే. కనుక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడిన, అదే ఒరవడి ఏపీలో కూడా కనిపిస్తే జగన్ పార్టీ ఉనికి మాత్రంగా కూడా జనంలో ఉండే అవకాశాలు మృగ్యమౌతాయి. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని, ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అది మాని జనం కనీసం నమ్మడానికి కూడా అవకాశం లేని ఆరోపణలు చేస్తూ రచ్చ చేసుకోవడం వల్ల నష్టమే కానీ ఇసుమంతైనా ప్రయోజనం ఉండదు.
ఇక చంద్రబాబు శ్వేత పత్రాల విడుదల పై కూడా జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. తన పాలనను విమర్శించే లక్ష్యంతోనే తప్పుడు లెక్కలతో, శ్వేత పత్రాల పేర చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-steps-towaeds-losing-people-trust-39-181681.html





