కోడి కత్తి.. కొంపకి నిప్పు.. కాదేదీ సానుభూతికి అనర్హం
Publish Date:Feb 12, 2025
Advertisement
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో సానుభూతిని పెంచుకునేందుకు ఎంతకైనా తెగిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్ గతంలో తనపై తానే దాడులు చేయించుకొని అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో సొంత బాబాయ్ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై నెట్టేసిన జగన్.. ప్రజలను నమ్మించడంలో విజయవంతం అయ్యారు. అదే క్రమంలో కోడికత్తి డ్రామాతో ప్రజల్లో సానుభూతిని అమాంతం పెంచేసుకొని ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ అసలు రూపాన్ని ప్రజలు కళ్లారా చూశారు. బాబాయ్ హత్యకేసు, కోడికత్తి డ్రామా అన్నీ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని ఏపీ ప్రజలు తెలుసుకొని కంగుతిన్నారు. గత ఎన్నికల సమయంలోనూ గులక రాయి డ్రామాతో ప్రజల్లో సానుభూతిని పెంచుకోవాలని జగన్ చూశారు. కానీ, అప్పటికే జగన్ నిజస్వరూపాన్ని చూసిన ప్రజలు ఓటు ద్వారా ప్రతిపక్ష హోదాకూడా ఇవ్వకుండా ఓడించారు. ఓడిపోయిన తరువాతకూడా జగన్ తీరులో మార్పు రావడం లేదు. మళ్లీ ప్రజల్లో సానుభూతికోసం సరికొత్త డ్రామాలకు తెరలేపాడు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను దాదాపు వదిలి పెట్టేశారు. ఏదో చుట్టపు చూపుగా రావడం తప్ప ఎక్కువగా బెంగళూరులోని ప్యాలెస్ లోనే ఉంటున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్ మీద ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పదేపదే దాడి చేస్తున్నట్లుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతకు ముందు జరిగిన చిన్నచిన్న సంఘటనల గురించి ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇటీవల జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం జరగడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ ముందు మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని ఆర్పారు. ఈ ఘటన ఈ నెల 5వ తేదీన జరిగింది. ఈ ఘటనను వైసీపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకున్నారు. జగన్‌పై దాడి చేసేందుకు కూటమి పార్టీల్లోని నేతలు పదేపదే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కొందరు ఓ అడుగు ముందుకేసి జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారనే భయంతో ఆయన్ను ఇబ్బంది పట్టేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రజలను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం జగన్ ఇంటి వద్ద భద్రతను పెంచింది. జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసు అధికారులు ఆయన ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడగ్గా.. అటు వైపు నుంచి సరైన సమాధానం రాలేదు. జగన్ ఇంటి మేనేజ్మెంట్ చూసుకునే వ్యక్తులు.. ఇంటి బయట పెట్టినవి డమ్మీ సీసీటీవీ కెమెరాలనీ.. వాటి విజువల్స్ లేవనీ సమాధానం ఇస్తున్నారట. జగన్ ఎనిమిది నెలల ముందు వరకు ముఖ్యమంత్రి. ఆయన ఇంటి ముందు ఇలా డమ్మీ కెమెరాలు పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, జగన్ ప్యాలెస్ సిబ్బంది సీసీ కెమెరాల పుటేజీలను ఇచ్చేందుకు వెనుకాడుతుండటంతో జగన్ ఇంటి పరిసరాల్లో అగ్ని ప్రమా దం విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల్లో సానుభూతి కోసమే అగ్ని ప్రమాదం డ్రామా నడిపారని.. ఇది ఐప్యాక్ స్క్రిప్టే అని.. లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. తాడేపల్లిలోని తన ఇంటి పరిసరాల్లో, అవసరమైతే తన ఇంటిపై దాడులు చేయించుకోని ఆ నెపాన్ని కూటమి నేతలపైకి నెట్టాలని, తద్వారా ప్రజలలో సానుభూతి సంపాదించుకోవాలన్నదే ఆ కొత్త డ్రామాగా పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. జగన్, వైసీపీ నేతల క్రూరమైన ఆలోచనల గురించి తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పా టు చేయించడంతోపాటు. అక్కడ పోలీసు భద్రతను పెంచారు. మరోవైపు జగన్ నివాసం వద్ద అగ్నిప్రమాదం కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. మంటలు చెలరేగిన ప్రాంతంలో మట్టి, బూడిద నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. మొత్తానికి జగన్ నివాసంపై కూటమి నేతలు దాడులకు దిగుతున్నారంటూ వైసీపీ నేతల అసత్యప్రచారంతో ఆడుతున్న డ్రామాలకు పోలీసులు చెక్ పెట్టారు. సానుభూతి కోసం జగన్ అడిన డ్రామా నిగ్గు తేల్చేందుకు రెడీ అవుతున్నారు.
తనపై తానే దాడి చేయించుకొని ప్రజల నుంచి సానుభూతి పొందడంలో జగన్ దిట్ట. అయిన జగన్ గతంలో అనేక సార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి విజయం సాధించారు కూడా. ఇప్పుడు ప్రజలలో సానుభూతి కోసం మళ్లీ అదే విధానాన్ని జగన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జగన్ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. దీంతో అన్నివర్గాల ప్రజలు జగన్ పాలనపై ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఇప్పట్లో ఆయన ప్రజలలోకి వచ్చే పరిస్థితి లేదు. వైసీపీ నేతలే ఈ విషయాన్ని జగన్ కు తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ప్రజలలోకి వెఢితే పరాభవం తప్పదన్న విషయాన్ని జగన్ కూడా గ్రహించారు. అందుకే తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. కానీ ఇదే పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగితే.. ఉనికి మాత్రంగా కూడా వైసీపీ మిగిలే అవకాశం లేదన్న భావనతో జగన్ సరి కొత్త డ్రామాకు తెర లేపారు.
http://www.teluguone.com/news/content/jagan-reddy-fire-accident-drama-for-sympathy-25-192793.html





