కోర్టు వాయిదాలలో జగన్ రికార్డ్.. ఏళ్ల తరబడి బెయిలు మరో రికార్డ్ ?
Publish Date:Aug 5, 2025
Advertisement
ఏంటీ జగన్ మోహన రెడ్డి ఇప్పటి వరకూ తనపై ఉన్న 31 కేసులలో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్రపంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయన 6904 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారా? ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. బేసిగ్గా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పదవీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నసంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనిపుడు సీఎం కాదుకదా... కనీసం ప్రతిపక్ష నేత కూడా కారు. ఒక సాధారణ ఎమ్మెల్యే, అయినా సరే ఎందుకు వాయిదాలు తీసుకుంటున్నారో అర్ధం కాలేదంటారు కొందరు. ఒక వేళ ఈ వాయిదాల లెక్క కరెక్టే అనుకున్నా.. ఇన్ని కోట్ల రూపాయల మేర లాయర్ల కోసం ఖర్చు చేశారన్నది నమ్మశక్యం కాలేదంటారు ఇంకొందరు. మామూలుగా అయితే ఈ న్యాయవాదులు ఇంత తీసుకోవాలన్న మాన్యువల్స్ ఉన్నాయ్. ఒక వేళ ఓపెన్ మార్కెట్లో ఆ రేటు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ ఇంత భారీ మొత్తం తీసుకుంటారా? అన్న ప్రశ్న తలెత్తోంది. ప్రస్తుతం చెక్కర్లు కొడుతున్న లెక్క ప్రకారం చూస్తే జగన్ ఒక వాయిదా అడగటానికి తన లాయర్ కి చెల్లిస్తున్న ఫీజు రూ. 2 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ఇంత డబ్బు ఎక్కడిది? తాను అధికారంలో లేను కాబట్టి ఆఫీసు రెంటు కట్టడానికే డబ్బుల్లేవంటూ ఏకంగా పార్టీ కార్యాలయాన్నే ఎత్తివేసిన జగన్.. తన కేసులలో ఒక వాయిదా కోరడానికి లాయర్ ఫీజుగా అంతంత పెద్ద మొత్తాలు ఎలా ఇస్తున్నారన్నది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జగన్ అయితే గత పదేళ్లకు పైగా బెయిలు మీద ఉన్న మాట వాస్తవం. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందిగా గతంలోనే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మొర పెట్టుకున్న మాట కూడా వాస్తవమే. అయినా కూడా జగన్ మోహన రెడ్డి ఇన్నేళ్ల పాటు బెయిలుపై బయట ఉండటం ఆశ్చర్యం అంటారు పరిశీలకులు. ఆ మాటకొస్తే ఇంత కాలం ఒక వ్యక్తి బెయిలుపై ఉండటం ఒక రికార్డు అంటారు. ఇలా ఇన్నేసేళ్లు బెయిలపై ఉండటం అన్నది జయలలిత, లాలూ ప్రసాద్ వంటి వారికే సాధ్యం కాలేదు. అలాంటిది జగన్ కి ఎలా సాధ్యమౌతోందన్న వ్యాఖ్యలు పుంఖానుపుంఖాలుగా వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. కొందరు రాజకీయ విశ్లేషకులు అయితే.. జగన్ , బీజేపీకి మధ్య చీకటి ఒప్పందం ఒప్పందం ఉందంటున్నారు. అందుకు మద్యం కేసును ఉదాహరణగా చూపుతున్నారు. ఈ కేసులో చెవిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు అరెస్టయ్యారంటే అది కూటమి ప్రభుత్వం వేసిన సిట్ వల్లనే తప్ప కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ వల్ల కానే కాదంటున్నారు. నిజానికి మద్యం కేసులో ఈడీకి కావల్సినన్ని సాక్ష్యాధారులు ఉన్నా కూడా ఇన్వాల్వ్ అయ్యే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఇలాంటి పరిస్తితుల్లో జగన్ అరెస్టు, బెయిలు రద్దు అన్నవి అంత సులభం కాదన్న మాట కూడా రాజకీయ వర్గాలలో కాస్లంత గట్టిగానే వినిపిస్తోంది. ఏది ఏమైనా జగన్ కేసుల వాయిదాలే ఒక రికార్డు అయితే ఇక ఇన్నేళ్ల పాటు జగన్ బెయిల్ మీద ఉండటం అన్నది మరో రికార్డు అంటున్నారు నెటిజనులు.
http://www.teluguone.com/news/content/jagan-record-in-court-adjournments-39-203569.html





