ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు.. జనంలో మరింత మసకబారిన జగన్ ప్రతిష్ఠ!?
Publish Date:Jul 31, 2024
Advertisement
ఇటీవలిఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అసలీ స్థాయి ఓటమి చవిచూడాల్సి వస్తుందని వైసీపీ ఊహించలేదు. ప్రజలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడుదామా అని ఎదురు చూశారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న జనం అంటూ తెలుగువన్ కూడా వరుస కథనాలు ఇచ్చింది. జగన్ తప్ప, వైసీపీ సీనియర్లు కూడా ఓటమిని ముందే కనిపెట్టేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ స్థాయి పరాజయంతో వైసీపీ ఉనికే ప్రమాదంలో పడిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీకి ప్రస్తుత పరిస్థితి జీర్ణించుకోవడం కష్టమే. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతమే 2024లో వైసీపీకి కూడా లభించింది. కాకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కింది. ఇప్పుడు అంటే 2024 ఎన్నికలలో పరాజయం స్థాయి ఎంత తీవ్రంగా ఉందంటే.. వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా లభించేందుకు అవసరమైనన్ని స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది. ఇలాంటి సందర్భంలో సాంప్రదాయంగా వస్తున్న నిబంధనలను అనుసరించి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అభ్యర్థనను తిరస్కరించడం సమంజసమే. అయితే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలని, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆయన రాజకీయ అజ్ణానాన్ని తేటతెల్లం చేస్తున్నది. అసెంబ్లీలో జరిగే వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వని ఒక మాజీ ముఖ్యమంత్రి కి తెలియకపోవడం నిజంగా విడ్డూరమే. ప్రతిపక్ష హోదా లేదా అధికారం ఈ రెండింటిలోనూ ఏదైనా సరే ప్రజలే ఇవ్వాలి. వారు అలా ఇవ్వలేదంటే జనాలకు ఆ పార్టీపై సదభిప్రాయం లేదని అర్థం. ఈ విషయాన్ని మరిచిపోయి దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చుకొని లబ్ది పొందాలనుకోవడం జగన్ రాజకీయ తప్పిదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన తప్పిదాలే ఇప్పటి పరిస్థితికి కారణమని జగన్ గ్రహించినట్లు కనిపించదు. తన ఓటమికి ప్రజలనే తప్పుపడుతున్న ఆయన అహంకారమే.. ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లేక్కేలా చేసిందని అంటున్నారు. పార్టీ ఘోర పరాజయానికి కారణాలపై ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలను, ఎన్నికల వ్యవస్థను నిందిస్తూ, తాను చాలా గొప్పగా పాలన సాగించానని జగన్ ఆత్మ స్థుతి చేసుకుంటున్నారు. ఇది ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీకి వెళ్లి తమ అభిప్రాయాలను చెప్పుకునవకాశం ఉంటుంది. ఆ అవకాశం అధికార పార్టీ ఇవ్వకపోతే అదే విషయాన్ని అసెంబ్లీ బయట మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలి. అంతే కాకుండా.. ప్రజలు ఇవ్వని హోదాను న్యాయస్థానాలను ఆశ్రయించి దక్కించుకుందామనుకోవడం.. ప్రజల దృష్టిలో మరింత పలుచన అవ్వడానికి దోహద పడుతుంది తప్ప మరో ప్రయోజనం సిద్ధించదు. శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే శాసనసభ్యుని ప్రాథమిక బాధ్యత. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా తాను పులివెందుల శాసనసభ్యుడిని మాత్రమేననీ, అంతకు మించి మరే ప్రత్యేకతా తనకు లేవనీ గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే మేలు.
http://www.teluguone.com/news/content/jagan-pride-further-diminish-39-181852.html





