జగన్ని దెబ్బతీయబోయి కాంగ్రెస్ గోతిలో పడిందా
Publish Date:Jul 4, 2013
Advertisement
కాంగ్రెస్ ఒకటి తలిచి రాయల తెలంగాణా అంశాన్ని మీడియాకు లీక్ చేస్తే, దాని మీద జరుగుతున్న నిరుపయోగమయిన చర్చలవల్ల ఊహించని విధంగా జగన్ మోహన్ రెడ్డికే మేలు జరుగుతోంది. కాంగ్రెస్ ఉద్దేశ్యం రాయల తెలంగాణా ప్రతిపాదన తెచ్చి జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టి లొంగ దీసుకోవడం. అతని పార్టీకి బాగా బలమున్న ప్రాంతాలను విడదీసి తెలంగాణాలో కలిపేసి, అతని పార్టీని దెబ్బ తీయగలమని అతనికి ఒక సంకేతం పంపేందుకే కాంగ్రెస్ రాయల తెలంగాణా ప్రతిపాదన ముందుకు తెచ్చింది. అయితే, ఊహించని విధంగా ఆ ప్రతిపాదనకు అన్ని వైపులా నుండి వ్యతిరేఖత ఎదురవడమే కాకుండా, దీనిపై జరుగుతున్న విస్తృత చర్చల వల్ల, సీమంధ్ర ప్రాంతంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభావం చాలా ఎక్కువగానే ఉందనే సంగతి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని ప్రభావం చూసి భయపడుతున్నదని, అందుకే రాయల తెలంగాణా ఆలోచన చేస్తోందని నిర్దారిస్తున్న విశ్లేషణల వల్ల జగన్ కి, ఆయన పార్టీకి రాజకీయ వర్గాలలో మరింత సానుకూల పరిస్థితిని ఏర్పరుస్తుంది. అదిగాక ఈ విశ్లేషణలు జగన్ కి చెందిన సాక్షి మీడియాలో కాకుండా వేరే ఇతర మీడియాలో జరుగుతుండటం వలన, ప్రజలలో, రాజకీయ వర్గాలలో జగన్ మోహన్ రెడ్డి బలంపై నమ్మకం కలుగుతుంది. అందువల్ల వైకాపా నేతలు కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకొని మరికొంత కాలం దీనిపై చర్చలు కొనసాగిస్తే, జగన్ మోహన్ రెడ్డి బలం గురించి ఫ్రీ గా ప్రచారమూ జరుగుతుంది. పనిలోపనిగా కాంగ్రెస్ బలహీనతను ఎండగట్టవచ్చును. కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టాలని పధకం వేస్తే, అది అతనికి, అతని పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పించి మేలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తను తవ్వుకొన్న గోతిలో తానే పడినట్లయిందిప్పుడు.
http://www.teluguone.com/news/content/jagan-mohan-reddy-39-24063.html





