అంబటి, రోజాలను పక్కన పెట్టనున్న జగన్.. కేబినెట్ లో నో ఛాన్స్
Publish Date:May 31, 2019
Advertisement
ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్.. ప్రస్తుతం తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. అయితే జగన్ మంత్రివర్గంలో.. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరు తెచ్చుకున్న అంబటి రాయుడు, ఆర్కే రోజా లకు స్థానం దక్కక పోవచ్చని ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేతలుగా కొందరిపై సింపతీ ఉన్నప్పటికీ, మంత్రి పదవులు ఇచ్చే విషయంలో జగన్ సుముఖంగా లేరట. తన టీమ్ లో వివాదరహితులకు మాత్రమే చోటివ్వాలని జగన్ భావిస్తున్నారట. ఒకవేళ అంబటి, రోజా వంటి వారికి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే.. కులం, మతం, జిల్లాలకు ప్రాతినిథ్యం వంటి లెక్కలన్నింటి తరువాతే వారి పేర్లు పరిశీలనకు వస్తాయని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. అంబటి ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ పడి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ఓడించారు. జగన్ వెంట కాంగ్రెస్ పార్టీని వీడిన తొలి బ్యాచ్ నేతల్లో అంబటి కూడా ఒకరు. తొమ్మిదేళ్ల నుంచి జగన్ తో పాటు ఉన్నారు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, ఆయన చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అంబటి గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం.. ఇక్కడి నుంచి నారా లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి, కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లులకు మంత్రి పదవులు దక్కుతాయని అంచనా వేస్తున్న విశ్లేషకులు.. గుంటూరు జిల్లాకు మూడో మంత్రి పదవికి చాన్స్ ఉండక పోవచ్చని అంటున్నారు. ఒకవేళ మూడో మంత్రి పదవి లభించే పక్షంలో గుంటూరు ఈస్ట్ నుంచి గెలుపొందిన మహమ్మద్ ముస్తఫాకు మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఇక రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాకు వస్తే, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవి ఖాయమని.. ఆయనతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు జగన్ చాన్స్ ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, జగన్ సహా మొత్తం 26 మందికి క్యాబినెట్ లో స్థానం ఉంటుంది. చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి నలుగురేసి చొప్పున మంత్రి పదవులు ఇస్తేనే అంబటి, రోజాలకు పదవి లభిస్తుంది. మరి అంబటి, రోజాలను మంత్రి పదవులు వరిస్తాయో లేదో చూడాలి.
http://www.teluguone.com/news/content/jagan-may-keep-firebrands-away-from-the-cabinet-39-87167.html





