బెంగళూరు టు లండన్.. జగన్ తిరిగొచ్చేది ఎప్పుడంటే?
Publish Date:Oct 11, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి లండన్ బయలుదేరారు. కోర్టు అనుమతిలో ఆయన ఓ పక్షం రోజుల పాటు యూకేలో పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనకు బయలుదేరడానికి ముందు ఆయన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలనీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించాలని ఆదేశించారు. తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ సంతకాలను గవర్నర్ కు అందజేస్తానన్నారు. ఆందోళనలకు పిలుపునివ్వడం, నేతలకు, క్యాడర్ ను ముందుకు నెట్టి తాను ముఖం చాటేయడం పట్ల వైసీపీ శ్రేణులలో అసహనం వ్యక్తం అవుతోంది. గతంలో కూడా రాష్ట్రంలో ఆందోళనలకు పిలుపునిచ్చి జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమయ్యేవారని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఎందుకంటే.. అక్కడ ఉన్న కుమార్తెలతో సమయం గడపడానికి అని చెబుతుంటారు. అండన్ లో వారి చదువులు పూర్తియిన తరువాత కూడా అక్కడే ఎందుకు ఉంటున్నారన్నది తెలియదు. కానీ జగన్ మాత్రం వారితో సమయం గడపడానికి అంటూ ఓ పదిహేను రోజుల పాటు పార్టీకి అందుబాటులో ఉండకుండా వెడుతున్నారు. జగన్ నర్సీపట్నం పర్యటన విషయంలో జనసమీకరణను పార్టీ నేతలు, శ్రేణులూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన స్వయంగా వచ్చినప్పుడే అంతంత మాత్రం అటెన్షన్ చూపిన పార్టీ శ్రేణులు.. ఇప్పుడు జగన్ విదేశాలకు వెడుతూ ఇచ్చిన ఆదేశాలను ఎంత మేరకు పాటిస్తారన్నది చూడాల్సిందే. ఇక మరో విషయమేంటంటే జగన్ లండన్ యాత్రకు అనుమతి ఇస్తూ కోర్టు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఇప్పటి వరకూ తన పాస్ పోర్టు రెన్యువల్ కు కూడా కోర్టకు వెళ్లకుండానే చేయించుకున్నారు. అంతెందుకు కోడి కత్తి కేసులో సాక్షిగా కూడా ఆయన కోర్టుకు హాజరు కావడానికి సాకులు చెబుతూ ఆ కేసును సాగదీస్తున్నారు. ఇక లండన్ నుంచి వచ్చిన తరువాతనైనా ఆయన సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరౌతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/jagan-leaves-for-london-39-207716.html





