మొన్న బ్బ బ్బ.. నిన్న బై బై.. అంతా జగన్నాటకం!
Publish Date:Feb 8, 2025
Advertisement
నన్ను వదిలేయకండి బాబోయ్ అంటూ పార్టీ నేతలు, శ్రేణులను వేడుకున్న జగన్ తాను మాత్రం ఏపీలో ఉండటానికి సిద్ధంగా లేరు. మీ కష్టాలు మీరు పడండి, మీ ఇబ్బందులు మీవే.. కానీ నా వెంట మాత్రం ఉండాలని బతిమలాడుకున్న జగన్.. పార్టీ సంక్షోభంలో ఉన్నా ఇసుమంతైనా పట్టించుకోకుండా బెంగళూరుకు చెక్కేశారు. ఆయన శుక్రవారం వరకూ ఏపీలో ఉన్నారు. అసలు గురువారం రాత్రే ఆయన బెంగళూరు వెళ్లాల్సి ఉందని, ఆ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు వైసీపీలో చేరే కార్యక్రమం ఉండటంతో ముళ్లమీద కూర్చున్నట్లుగా శుక్రవారం ఉదయం ఆయన చేరిక పూర్తయ్యే వరకూ ఆగిన జగన్ ఆ తరువాత క్షణం ఆలస్యం చేయకుండా గన్నవరం విమానాశ్రాయినికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు. ఆయన ఏపీ రాజకీయాలను ఏదో వీకెండ్ వ్యవహారంలో చూస్తున్నారని పరిశీలకులు అంచనావేస్తున్నారు. వారంలో ఏదో రెండు మూడు రోజులు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి, ఆ టైంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాసుకొచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అధికార తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పించి మళ్లీ బెంగళూరు వెళిపోవడం రివాజుగా మారిపోయింది. వాస్తవానికి తన విదేశీ పర్యటనకు ముందు సంక్రాంతి తరువాత నుంచీ జిల్లాల పర్యటన చేపడతాననీ, కార్యకర్తలతో జగనన్న కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తాననీ చెప్పిన జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో క్యాడర్ కూడా జగన్ ను పట్టించుకోవడం మానేసింది. అసలే విజయసాయిరెడ్డి పార్టీని వీడటం,సీనియర్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆక్రమించారనే ఆరోపణలపై దర్యాప్తు ఆరంభం కావడం, మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులను ఈడీ సీజ్ చేయడం వంటి వరుస ఘటనలతో పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా జగన్ పార్టీనీ, పార్టీ ఇబ్బందులను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్లిపోవడం పట్ల పార్టీలోనే తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఒక వైపు విజయసాయి క్యారెక్టర్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ రేగుతోంది. స్వయానా జగన్ సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. జగన్ కు అసలు క్యారెక్టరే లేదంటూ.. వైఎస్ అభీష్ఠానికి వ్యతిరేకంగా తనకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా మోసం చేశారని మరో సారి ధ్వజమెత్తారు.
ఇక పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలోనూ పీకల్లోతు కూరుకుపోయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో పార్టీని, పార్టీ ఇబ్బందులనూ పట్టించుకోకుండా జగన్ బెంగళూరు చెక్కేశారు. దీంతో పార్టీ నేతలూ, క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒక వైపు మళ్లీ మనం అధికారంలోకి వస్తాం అంటూ చెబుతున్న జగన్ పార్టీని పట్టించుకోకుండా రాష్ట్రం బయటే గడపడం పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.
http://www.teluguone.com/news/content/jagan-leaved-to-bengalore-39-192555.html





