పంద్రాగస్టున జెండా ఆవిష్కరణకు దూరంగా జగన్?
Publish Date:Aug 16, 2025
Advertisement
అధికారంలో ఉన్నామా? లేదా? ఈ పార్టీయా? ఆ పార్టీయా? అన్న విషయాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులంతా పంద్రాగస్టు రోజున జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దేశ స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొని దేశ భక్తిని చాటుకుంటారు. పార్టీలు, అధికారం వంటి విషయాలను స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలతో ముడి పెట్టరు. అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రూటే సెపరేటు. ఆయన ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. కనీసం తన నివాసంలో జెండా ఆవిష్కరించడానికి కూడా ఆయన ముందుకు రాలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన లేరు సరే.. కనీసం బెంగళూరులోని తన నివాసంలో కూడా ఆయన జెండా ఎగురవేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన జెండా ఆవిష్కరిస్తున్న ఫొటో మీడియాలో కానీ, వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక వైపు దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు, నాయకులు, సామాన్య ప్రజలూ కూడా ఘనంగా పంద్రాగస్టు వేడుకలలో పాల్గొన్నారు. అయితే విచిత్రంగా జగన్ మాత్రం పంద్రాగస్టునాడు కనీసం జెండా ఆవిష్కరణ కూడా చేయలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంటే 2019- 2024 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం పంద్రాగస్టు నాడు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎన్నడూ పార్టీ కార్యాలయంలో, తన నివాసంలో జెండాను ఆవిష్కరించారు. ఆనవాయితీని భగ్నం చేయలేదు. అయితే మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం జెండా ఆవిష్కరణ చేయలేదు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ఓటమి బాధనుంచి తేరుకోలేదా? అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉంటే మాత్రమే పంద్రాగస్టుకు జెండా ఆవిష్కరిస్తారా? అధికారం కోల్పోతే దేశంపై భక్తి ఉండదా? అంటూ నిలదీస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-keep-himself-distance-from-flag-hoisting-39-204324.html





