జగన్ కోసం అంత చేసిన ముద్రగడకు దక్కిందేంటి?
Publish Date:Jul 3, 2026
Advertisement
ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా రాష్ట్రంలో ఈ పేరు చిరపరిచితం. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున క్రియాశీలంగా పని చేసిన ఆయన.. ఉమ్మడి తూర్పుగోదావరిలో వైసీపీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ పరాజయం పాలైతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి, అంత పనీ చేశారు. అయితే ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరించిన వైఖరి ఎవరికీ అర్ధం కావడం లేదు. వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో చెప్పించారు. ముద్రగడ పద్మనాభంకు రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ఎక్కువ గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు ముద్రగడ సమకాలీనుడు. వారితో పాటే.. 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రిగా, ఎంపీగా కూడా పని చేశారు. అయితే తదననంతర పరిణామాలలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పరాజయం పాలయ్యారు. దీంతో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటువంటి ముద్రగడ.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమే కాకుండా, కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదు సరికదా.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చింది. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా ముద్రగడ ఆ కాపు ఉద్యమాన్ని నడిపారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది. ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ.. కాపు రిజర్వేషన్ నినాదాన్ని, ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. ఇంత చేసినా ముద్రగడకు వైసీపీలో వీసమెత్తు ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్. అయినా కూడా ముద్రగడ.. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విస్తృతంగా ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించకుండా తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో అన్నట్లుగానే ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభంగా అధికారికంగా మార్చుకున్నారు. జగన్ కోసం ఇంత చేసిన ముద్రగడకు.. జగన్ నుంచి వీసమెత్తు గుర్తింపు కూడా లేకుండా పోయిందని కాపు సామాజికవర్గ నేతలు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడను జగన్ కనీసం పరామర్శించను కూడా పరామర్శించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ పరామర్శించకుంటే పోయె.. కానీ జగన్ తమకు అన్నివిధాలుగా అండగా నిలిచారనీ, ఆయన ముద్రగడను పరామర్శించడానికి వస్తానంటే.. తామే వద్దన్నామంటూ ముద్రగడ కుమారుడు వీడియో విడుదల చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎవరైనా ఎలా, ఎందుకు వద్దంటారు? అంటూ, జగన్ ఒత్తిడి మేరకే ముద్రగడ కుమారుడు ఆ వీడియో విడుదల చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముద్రగడను పరామర్శించడానికి జగన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-illtreat-mudragada-25-224957.html





