జగన్ భయపడ్డారు.. అందుకే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పడ్డాయ్..
Publish Date:May 1, 2024
Advertisement
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు. ఫిట్ మెంట్, డిఏ బకాయిల విషయంలో అడిగినందుకు జగన్ సర్కార్ వారిని నానా ఇబ్బందులూ పెట్టింది. అంతెందుకు ఫిట్ మెంట్ పేరుతో జీతాలు తగ్గించేసి ఉద్యోగ సంఘాల నేతలతో చప్పట్లు కొట్టించుకుంది. ఔను 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఉద్యోగులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పీఆర్సీ విషయంలో చేయగలిగినంత జాప్యం చేసి చివరకు ఇక తప్పదన్నట్లుగా 2022 జనవరిలో వారికి పీఆర్సీ ఇచ్చింది. ఎక్కడైనా పీఆర్సీ ఇస్తే జీతాలు పెరుగుతాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం రివర్స్ లో ఆలోచించింది. జగన్ సర్కార్ పీఆర్సీ ప్రకటించిన తరువాత ఉద్యోగుల జీతాలు తగ్గాయి. నిజం వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా జరిగింది మాత్రం అదే. ఉద్యోగులకు అప్పటికే మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం ఉండగా, జగన్ సర్కార్ ఫిట్మెంట్ 23 శాతం ఇచ్చింది. దీంతో ఉద్యోగుల వేతనాలు 4 శాతం తగ్గాయి. దాంతో తగ్గిన ఫిట్మెంట్ ప్రభావంతో డీఏలు.. హెచ్ఆర్ఏల్లో కూడా కోత పడింది. దాంతో అప్పట్లో ఉద్యోగులు తమకు ఇచ్చింది పే రివిజన్ కాదు పే రివర్స్ అని ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చే శారు. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఉద్యోగులకు కష్టాలూ వేధింపులు ఆరంభమయ్యాయనే చెప్పాలి. సమయానికి వేతనాలు ఇచ్చింది లేదు. వేతనాల కోసం రోడ్డెక్కితే ఉపాధ్యాయులు, ఉద్యోగులపై జగన్ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడింది. కారాలూ మిరియాలూ నూరింది. వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించింది. రారయతీలు, అలవెన్సుల మాట దేవుడెరుగు అసలు జీతాలకే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వేతనాల కోసం నిలదీసినందుకు అసలు వారు పని చేయడం లేదంటూ ప్రచారం చేసింది. సమయపాలన లేదని నిలదీసింది. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్ అంది. పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారంటూ ప్రజలలో వారిని పలుచన చేయడానికి ప్రయత్నించింది. విధులకు పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామని బెదరించింది. దీంతో జగన్ సర్కార్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు జగన్ పవన్ కట్ చేయడమొక్కటే తమ సమస్యలకు పరిష్కారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయం అర్ధమైన తరువాత జగన్ సర్కార్ వారిని ఎన్నికల విధులకు దూరం చేయాలని ఎత్తుగడ వేసింది. వాలంటీర్లతో పబ్బం గడిపేసుకోవచ్చని భావించింది. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు ఎన్నికల సంఘం దూరం చేయడంతో ఇప్పుడు మళ్లీ ఉద్యోగులను మంచి చేసుకోవడానికి తహతహలాడుతోంది. అందులో భాగమే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా మే నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించడం అని పరిశీలకులు అంటున్నారు. అయితే ఉద్యోగుల సహనం పూర్తిగా నశించాక ఇప్పుడు వారిని మంచి చేసుకోవడానికి జగన్ ఏ ప్రయత్నం చేసినా వృధాయే అని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు జగన్ సర్కార్ విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్నారనీ ఇప్పుడిక జగన్మాయలో పడే అవకాశమే లేదనీ అంటున్నారు. మొత్తం అనూహ్యంగా 1నే వేతనాలు పడటం ఉద్యోగులనే విస్మయానికి గురి చేసింది. తామంటే జగన్ భయపడ్డాడనడానికి ఇదే నిదర్శనమని వారంటున్నారు. ఈ ఒక్క నెల సమయానికి వేతనాలిచ్చేసినంత మాత్రాన తమ నిర్ణయం మార్చుకునే ప్రశక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-feared-employees-salaries-credited-on-1st-25-174919.html