పులివెందుల పులి.. పిల్లి కూతలు
Publish Date:Aug 13, 2025
Advertisement
నా ఘోష ఎవరికీ పట్టదా అంటూ జగన్ బేల మాటలు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అన్నారు చలం. ఆయనే ఇప్పుడు బతికి ఉంటే కృష్ణశాస్త్రి బాధ కాదు, జగన్ బాధ ప్రపంచానికి బాధ అని అని ఉండేవారు. ప్రపంచం అంతా తనకు మద్దతుగా నిలవాలనీ, అందరూ తనకు సానుభూతి చూపాలనీ, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల వల్లే జనం మద్దతు దండిగా ఉన్నా గత ఏడాది ఎన్నికలలో తనకు ఘోర పరాజయం ఎదురైందనీ జగన్ బాధపడటమే కాదు... అందరూ, అన్ని పార్టీల వారూ కూడా తనకు మద్దతుగా ఆ బాధపడాలని గట్టిగా కోరుకుంటారు. అలా తనకు మద్దతుగా నిలవని వారంతా చంద్రబాబుకు దగ్గర అనీ, ఆయనతో కుమ్మక్కు అయ్యారనీ గట్టిగా నమ్మడమే కాకుండా ప్రపంచం కూడా నమ్మాలని కోరుకుంటారు జగన్. తన అడ్డా అనుకున్న పులివెందులలో వైసీపీ చతికిల పడటం, తన ఖిల్లా అనుకున్న పులివెందుల బీటలు వారడంతో ఆయన ఇక తనకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవన్న నిర్వేదంలో పడిపోయారు జగన్. ఇప్పుడు ఆయన ప్రపంచం అంతా తనపై పగబట్టిందన్న భ్రమల్లో మునిగిపోయారు. దీంతో కోడిగుడ్డుకు, బోడిగుండుకు ముడిపెడుతున్న చందంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ బుధవారం (ఆగస్టు 13) మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ తనకూ, తన పార్టీకీ అన్యాయం జరుగుతున్నా ఎవరూ వచ్చి ఖండించడం లేదని ఆక్రోశం వెలిబుచ్చారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఎవరూ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని, పులివెందులలో తన పార్టీ పట్టు కోల్పోవడాన్ని ఎందుకు ఖండించడం లేదని నిలదీస్తున్నారు. ఇంత కాలం తాను దత్తపుత్రుడిగా సహకారం అందించిన ప్రధాని మోడీసైతం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతే కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు తన పరిస్థితికి కానీ, వైసీపీ పతనానికి కానీ కారణం తానేనన్న విషయాన్ని ఇసుమంతైనా గుర్తించడానికి నిరాకరిస్తూ.. తనకు మద్దతుగా నిలవని వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. అయితే పిల్లి శాపనార్ధాలకు ఉట్టితాళ్లు తెగిపడవన్న సమెతను గుర్తుకు తెచ్చేలా మాట్లాడుతున్నానని గ్రహించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో మాట్లాడుకుంటూ.. తన పతనానికి కుట్రలు చేస్తున్నారని పులివెందుల ఎమ్మెల్యే యువజన శ్రామిక రైతు పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన సొంత చెల్లి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిత్యం జగన్ పై చేస్తున్న విమర్శలకు జగన్ ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. అయినా జగన్ కు ఎవరైనా ఎందుకు మద్దతుగా నిలుస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ గత ఏడాది ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. అయితే అదే బీజేపీయేతర పార్టీలు మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు జగన్ ఇసుమంతైనా మద్దతు ఇవ్వలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు.. ఇప్పుడు పులివెందులలో రిగ్గింగు, పోలింగ్ బూత్ ల మార్పు అంటూ గగ్గోలు పెడుతున్న జగన్.. రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా హస్తినలో చేపట్టిన ఆందోళనలో పాల్గొనడం అటుంచి కనీసం మద్దతు కూడా ప్రకటించలేదన్న విషయం ఎలా మరచిపోయారు?
http://www.teluguone.com/news/content/jagan-disgusting-comments-39-204152.html





